ప్రియురాలిని హత్య చేసి, సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం
ప్రియురాలిని హత్య చేసి, సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం
- గొంతునొక్కి హత్య చేసిన వివాహితుడు
- కుటుంబ సభ్యుల సహకారంతో మృతదేహం పారవేత
- దుర్వాసనతో వెలుగులోకి వచ్చిన ఘటన
భోపాల్, 14 ఫిబ్రవరి 2026 (పీపుల్స్ మోటివేషన్): మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. వివాహితుడైన వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఇనుప ట్రంక్ పెట్టెలో పెట్టి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కమలా నగర్ ప్రాంతానికి చెందిన సమీర్‌కు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియా సామాజిక మాధ్యమాల ద్వారా అతనికి పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితం సియా మహారాష్ట్ర నుంచి భోపాల్ చేరుకుని సమీర్ ఇంట్లోనే నివసించడం ప్రారంభించింది. ఆమెను స్నేహితురాలిగా కుటుంబ సభ్యులకు పరిచయం చేసినట్లు సమాచారం. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని సియా సమీర్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ విషయమై సమీర్ భార్యతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పరిస్థితులు విషమించడంతో సమీర్ భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే సమయంలో సియా, సమీర్ మధ్య గొడవలు మరింత పెరిగాయి. తనను వివాహం చేసుకోవాలని లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సియా డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఫిబ్రవరి 9 సాయంత్రం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో సమీర్ సియాను గొంతునొక్కి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని పారవేయడానికి తన తల్లి, సోదరుడు, సోదరితో కలిసి కుట్ర పన్నాడు. సియా మృతదేహాన్ని ఇనుప ట్రంక్ పెట్టెలో ఉంచి అర్ధరాత్రి సమయంలో నిషాత్‌పురా ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న పిల్లలు సెప్టిక్ ట్యాంక్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించి పెద్దలకు తెలిపారు. స్థానికులు పరిశీలించగా ట్యాంక్‌లో ఇనుప పెట్టె కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పెట్టెను బయటకు తీసి తెరిచారు. అందులో కుళ్లిన మహిళ మృతదేహం లభించింది. శరీరంపై ఉన్న టాటూ, పుట్టిన తేదీ ఆధారంగా సియాగా గుర్తించారు. ప్రధాన నిందితుడు సమీర్‌తో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
