క్రేజీ రామ్-కామ్.. ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసల జల్లు!!
క్రేజీ రామ్-కామ్.. ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసల జల్లు!!
హైదరాబాద్ – 8 ఫిబ్రవరి – పీపుల్స్ మోటివేషన్
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా విడుదలైన తమిళ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘విత్ లవ్’పై ప్రశంసల వర్షం కురిపించారు. ఫిబ్రవరి 6, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ మూవీ యూనిట్‌ను అభినందించారు. ఇటీవల కాలంలో వచ్చిన ఆహ్లాదకరమైన, చక్కని రొమాంటిక్ కామెడీల్లో ‘విత్ లవ్’ ఒకటి అని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తెలుగు వెర్షన్‌లోని డైలాగులు చాలా సందర్భోచితంగా, నీట్‌గా ఉన్నాయని అనిల్ రావిపూడి కొనియాడారు. టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ దర్శకుడు మదన్ ఈ కథను ఎంతో సెన్సిటివ్‌గా తెరకెక్కించారని, డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ అతని పనితీరు ప్రశంసనీయం అని అన్నారు. హీరో అభిషన్ జీవింత్, హీరోయిన్ అనస్వర రాజన్ తమ పాత్రల్లో ఒదిగిపోయి సహజంగా నటించారని పేర్కొంటూ వారి పెర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పారు.
ఇక సంగీత దర్శకుడు షాన్ రోల్డన్ అందించిన మ్యూజిక్ కథకు మంచి ఎమోషన్‌ను జోడించిందని, నేపథ్య సంగీతం కూడా కొన్ని సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసిందని ప్రశంసించారు. ప్రేమించిన వ్యక్తులకు గతంలో తమ భావాలను చెప్పలేకపోయిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ కలిసినప్పుడు వారి జీవితాల్లో చోటు చేసుకునే సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని, సింపుల్‌గా చెప్పాలంటే ఇది హార్ట్ టచ్ చేసే లవ్ స్టోరీ అని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రానా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్‌తో పాటు నిర్మాత సౌందర్య రజనీకాంత్ బృందానికి కూడా అనిల్ రావిపూడి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిన్న కథతో పెద్ద భావోద్వేగాన్ని పండించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి స్పందన తెచ్చుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
