పీకలవాగు పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
పీకలవాగు పరిశీలన చేపట్టిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
- సిల్ట్ క్లియరెన్స్, ప్రహరీగోడ నిర్మాణానికి ఆదేశాలు
- వరదల నివారణకు ముందస్తు చర్యలపై దృష్టి
గుంటూరు, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం నగర కమిషనర్ మయూర అశోక్‌తో కలిసి విస్తృతంగా పరిశీలించారు. 1/18 బ్రాడీపేట, కోబాల్ట్‌పేట 6వ లైన్, దేవాపురం 4వ లైన్, కంకరగుంట ఆర్‌యూబీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వర్షాకాలంలో ఏర్పడే వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పీకలవాగులో పేరుకుపోయిన సిల్ట్‌ను యుద్ధప్రాతిపదికన తొలగించాలని, అవసరమైన చోట్ల ప్రహరీగోడ నిర్మాణం చేపట్టాలని కమిషనర్‌కు ఆదేశించారు. లో-లెవల్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పీకలవాగు నగరానికి అత్యంత కీలకమైన ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అని తెలిపారు. గతంలో సుమారు 60 అడుగుల వెడల్పుతో ప్రవహించిన వాగు ప్రస్తుతం అక్రమ ఆక్రమణల కారణంగా కేవలం 10 అడుగులకు పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు.
పీకలవాగు పరిసర ప్రాంతాల్లో చెత్త, వ్యర్థాలను వాగులో వేయడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజారోగ్య అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించి వ్యర్థాల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కోబాల్ట్‌పేట వంటి ప్రాంతాల్లో కొత్త డ్రైన్‌ల నిర్మాణం, పీకలవాగుపై ఉన్న కల్వర్టుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

