థాయ్‌లాండ్ మాస్టర్స్ ఛాంపియన్‌గా దేవికా సిహాగ్.. భారత్‌కు మరో స్వర్ణక్షణం!
థాయ్‌లాండ్ మాస్టర్స్ ఛాంపియన్‌గా దేవికా సిహాగ్.. భారత్‌కు మరో స్వర్ణక్షణం!
బ్యాంకాక్ – 04 ఫిబ్రవరి 2026 – పీపుల్స్ మోటివేషన్
భారత యువ షట్లర్ దేవికా సిహాగ్ థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచి దేశానికి గర్వకారణంగా మారింది. ఈ విజయం ద్వారా దేవిక తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిల్‌ను సొంతం చేసుకుంది. హర్యానాకు చెందిన 20 ఏళ్ల దేవిక, ఫైనల్లో మలేసియాకు చెందిన ప్రపంచ 68వ ర్యాంకర్ గో జిన్ వెతో తలపడింది.
ఫైనల్ మ్యాచ్‌లో దేవిక తొలి గేమ్‌ను ఏకంగా 21-8తో సులభంగా గెలుచుకుంది. రెండో గేమ్‌లో కూడా 6-3 ఆధిక్యంలోకి వెళ్లిన సమయంలో ప్రత్యర్థి గో జిన్ వె గాయంతో మ్యాచ్ నుంచి వైదొలగడంతో దేవిక విజయం ఖరారైంది. ఈ టోర్నీ మొత్తం దేవిక ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా టైటిల్ సాధించడం విశేషం.
ఈ విజయంతో దేవికకు 18750 డాలర్ల ప్రైజ్ మనీతో పాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత థాయ్‌లాండ్ సూపర్ 300 టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక చరిత్ర సృష్టించింది.
టైటిల్ అనంతరం దేవిక మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదే తొలి సూపర్ 300 స్థాయి టైటిల్ కావడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఈ సీజన్‌లో మరిన్ని టోర్నీల్లో పాల్గొని మరింత మెరుగైన ప్రదర్శన చేయాలన్న లక్ష్యం ఉందని పేర్కొంది. ఫైనల్ మ్యాచ్‌లో గెలుపోటముల గురించి కాకుండా తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించడంపైనే దృష్టి పెట్టానని చెప్పింది.
ప్రస్తుతం దేవిక బెంగళూరులోని పదుకొనే–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో కోచ్ ఉమేంద్ర రాణా వద్ద శిక్షణ పొందుతోంది. ఈ విజయం భారత బ్యాడ్మింటన్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
