పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- నిందితులను రోడ్లపై నడిపించిన ఘటనలపై విచారణ
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు
అమరావతి, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
నిందితులను రోడ్లపై నడిపిస్తూ తీసుకువెళ్లిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల ఈ తరహా చర్యలు చట్టబద్ధమా? అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ కొన్ని వీడియోలు, ఫోటోలను న్యాయస్థానానికి సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని, నిందితులను ప్రజల ముందు అవమానకరంగా రోడ్లపై నడిపించడం చట్టవిరుద్ధమైన చర్య అని పిటిషనర్ వాదించారు. పోలీసులు చట్టానికి లోబడి, మానవీయంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ, కొవ్వూరులో నిందితుడిని తీసుకువెళ్తున్న వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో రోడ్డుపై నడిచిన సమయంలో ఫోటోలు తీయబడ్డాయని కోర్టుకు వివరించారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు, పోలీసులు ప్రజలతో వ్యవహరించే తీరు మరింత మెరుగ్గా ఉండాలని వ్యాఖ్యానించింది.
కొన్ని వీడియోలలో పోలీసులు ఇష్టారీతిన తిడుతున్నట్లు కనిపిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. పోలీసుల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తించరాదని హితవు పలికింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది.
