రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
- అద్దె భవనాలకు చెక్
- తొలి దశలో 65 కార్యాలయాలకు నిర్మాణం
- ప్రజలకు గౌరవప్రదమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్, ఉప విభాగాధికారి కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరికాదని, ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలనే దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించామని చెప్పారు. మొదటి దశలో ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఉప విభాగాధికారి కార్యాలయాలకు సకల వసతులతో కూడిన శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాలను పునర్నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాలు ఒకే నమూనాలో, ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా రూపకల్పన చేయాలని చర్చించారు. స్టాంపులు మరియు నమోదు శాఖలో ఆధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. గచ్చిబౌలి, మేడ్చల్, పఠాన్ చెరువు ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, గచ్చిబౌలి భవనం తుది దశలో ఉందని వెల్లడించారు.
గత ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా మండలాలు విభజించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొత్త మండలాలకు అవసరమైన సిబ్బందిని కేటాయించి సేవలను బలోపేతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Comments

