అసంపూర్తి అంగన్వాడీ భవనాల పనులు పునఃప్రారంభించాలి: బండారు శ్రావణి
అసంపూర్తి అంగన్వాడీ భవనాల పనులు పునఃప్రారంభించాలి: బండారు శ్రావణి
- శింగనమలలో 22 భవనాలు నిలిచిపోయినట్టు వెల్లడి
- కొత్త అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు డిమాండ్
- అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు కోరుతూ విజ్ఞప్తి
అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ కేంద్రాల పనులను పునఃప్రారంభించి, కొత్త భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కోరారు. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,000 అంగన్వాడీ భవనాలు నిర్మించారని ఆమె గుర్తుచేశారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో ఈ పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు.
అయితే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల కొత్త భవనాలు నిర్మించలేదని, అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీలకు కిరాయిలు కూడా చెల్లించలేదని విమర్శించారు. చిన్న మరమ్మతులు కూడా చేపట్టకుండా వ్యవస్థను బలహీనపరిచారని ఆరోపించారు. నాడు-నేడు పేరుతో పనులు పూర్తి చేయకుండా వదిలేసిన కారణంగా అనేక కేంద్రాలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు.
శింగనమల నియోజకవర్గంలోనే గత ప్రభుత్వ హయాంలో 22 అంగన్వాడీ భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని వెల్లడించారు. వసతులు లేని భవనాల్లో అంగన్వాడీలు కొనసాగుతున్నాయని, ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అసంపూర్తి పనులను వెంటనే ప్రారంభించి, కొత్త కేంద్రాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని సభాపతి ద్వారా సంబంధిత శాఖ మంత్రిని కోరారు.
అంగన్వాడీలను ఉచిత పాఠశాల వ్యవస్థలో భాగంగా తీసుకురావడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను కూడా పూర్తి చేసి అభివృద్ధి చేయాలని బండారు శ్రావణి విజ్ఞప్తి చేశారు.
