పెమ్మసాని, గల్లా మాధవిపై మౌనిక సంచలన ఆరోపణలు
పెమ్మసాని, గల్లా మాధవిపై మౌనిక సంచలన ఆరోపణలు
- తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు
- పోలీసులే దాడికి సహకరించారని ఆరోపణ
- వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపాటు
అమరావతి, ఫిబ్రవరి 7 (పీపుల్స్ మోటివేషన్): కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. పెమ్మసాని ఆదేశాలతో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యవేక్షణలో తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ దాడికి పోలీసులు కూడా సహకరించారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తొలిసారి ఎమ్మెల్యే అయిన గల్లా మాధవికి ఇంత అహంకారం పనికిరాదని మౌనిక హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థల కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. బాగా చదువుకున్న వ్యక్తిగా, విదేశాల నుంచి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
తన తండ్రి అంబటి రాంబాబు ఎలాంటి రెడ్ బుక్‌లకు భయపడే వ్యక్తి కాదని మౌనిక తెలిపారు. లా అండ్ ఆర్డర్‌పై గౌరవంతోనే ఆయన క్షమాపణ చెప్పారని స్పష్టం చేశారు. రెండు వేల మంది చుట్టుముట్టి, రాళ్లు రువ్వినా తన తండ్రి ధైర్యంగా నిలబడ్డారని చెప్పారు. ఇంటి గోడకు గునపాలు దింపుతున్నా, వ్యవస్థపై నమ్మకంతోనే ఆయన ఇంట్లో కూర్చున్నారని మౌనిక అన్నారు. కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తులు వచ్చి మహిళలపై దాడులు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
