ఏడు కార్పొరేషన్‌ల్లో మేయర్ ఎన్నికలు పూర్తి
ఏడు కార్పొరేషన్‌ల్లో మేయర్ ఎన్నికలు పూర్తి
- ఐదు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం
- కరీంనగర్‌లో బీజేపీ విజయం
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం ఏడు కార్పొరేషన్‌లలో ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ సమాన స్థానాలు గెలవడంతో రెండు పార్టీలు అవగాహనకు వచ్చాయి.
కరీంనగర్ మేయర్ పదవి కోసం మొదటి నుంచి ఉత్కంఠ నెలకొనగా చివరికి బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. నిజామాబాద్‌లో మజ్లిస్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ మేయర్ పదవిని దక్కించుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాలు గెలవడంతో రొటేషన్ పద్ధతిలో అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్‌కు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఇక్కడ బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలు గెలిచింది. సీపీఐకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ, సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో కలసి ముందుకు సాగింది.
కార్పొరేషన్‌ల వారీగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌లు ఇలా ఉన్నారు. కరీంనగర్‌లో మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నికయ్యారు. నిజామాబాద్‌లో మేయర్‌గా ఉమారాణి, డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఎంపికయ్యారు. రామగుండంలో మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతిపెల్లి ఎల్లయ్య ఎన్నికయ్యారు. కొత్తగూడెంలో మేయర్‌గా మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్‌గా సిరిపురపు లలిత కుమారి బాధ్యతలు చేపట్టారు. నల్గొండలో మేయర్‌గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్‌గా మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్ ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌లో మేయర్‌గా గుమల్ మమత, డిప్యూటీ మేయర్‌గా సురేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాలలో మేయర్‌గా మధుకర్, డిప్యూటీ మేయర్‌గా రమ్య మహేశ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీయనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
