ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
- ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టులు
- హింసకు పరిష్కారం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
- లొంగిపోయిన వారికి పునరావాసం, రక్షణ హామీ
హైదరాబాద్, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ప్రజా సమస్యలకు ఆయుధాలు, హింస ద్వారా పరిష్కారం దొరకదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ హైదరాబాద్‌లోని ఐసీసీసీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారు తమ వద్ద ఉన్న 124 అత్యాధునిక ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పిలుపును నమ్మి ముందుకు వచ్చిన మావోయిస్టులు జనజీవనంలోకి కలవడం శుభపరిణామమన్నారు. లొంగిపోయిన వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వారికి రక్షణ కల్పిస్తామని తెలిపారు. సాధారణ జీవితం గడపడానికి అవసరమైన ఆర్థిక సహాయం, ఇతర వసతులను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
మహాత్మా గాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని ఆయన అన్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు దేవ్ జీ, దామోదర్, రాజిరెడ్డి, చంద్రన్న తదితరులు తమ పునరావాసానికి సంబంధించిన ప్రతిపాదనలు తనకు తెలియజేశారని తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటు, పునరావాసం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అవసరమైతే కేసుల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం వెల్లడించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోతే వారికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీ విజయ్ కుమార్, ఐజీ సుమతి తదితర అధికారులు పాల్గొన్నారు.
