రూ.250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
రూ.250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
- రంగారెడ్డి జిల్లాలో 2.34 ఎకరాల భూమికి ఫెన్సింగ్
- దశాబ్దాలుగా కొనసాగిన వివాదానికి పరిష్కారం
- ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు
రంగారెడ్డి, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని రాంబాగ్ ప్రాంతంలో ఉన్న 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. సర్వే నంబర్లు 354/1, 354/2, 354/3లలో ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ.250 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భూమి చుట్టూ దేవాలయాలు ఉండగా మధ్యలో ఉన్న ఈ ప్రభుత్వ భూమిపై గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ భూమికి ఆనుకుని సిక్కు మతస్తులకు సంబంధించిన ఒక సమాధి ఉండటంతో ఈ స్థలంపై రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఒక వర్గం ఈ భూమిని దేవాలయాలకు కేటాయించాలని కోరగా, మరో వర్గం సిక్కు సమాజానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో సిక్కు మతస్తులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని జనవరి 29న జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసి మూడు నెలల గడువు ఇచ్చింది.
ఈ మధ్య కాలంలో సిక్కు మతస్తులు ఆ భూమి చుట్టూ టిన్ షీట్లతో ప్రహరీ నిర్మించి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో విషయం అధికారుల దృష్టికి వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఇరు వర్గాలతో మాట్లాడి సంబంధిత పత్రాలను పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆ భూమి ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం టిన్ షీట్లతో వేసిన ప్రహరీని తొలగించి మొత్తం 2.34 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సిక్కు మతస్తులకు చెందిన సమాధి ఉన్న 366 గజాల స్థలాన్ని మినహాయించి మిగతా భూమి చుట్టూ ఫెన్సింగ్ చేయడంతో వివాదం తీరింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు.
