వెంగళరావు నగరంలో రూ.600 కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
వెంగళరావు నగరంలో రూ.600 కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ
- మూడు ఎకరాల భూమికి హైడ్రా ఫెన్సింగ్
- ఆక్రమణలపై కఠిన చర్యలు
- తప్పుడు పత్రాలతో కబ్జాలకు యత్నించిన పలువురు
హైదరాబాద్, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్): నగరం నడిబొడ్డున ఖైరతాబాద్ మండలంలోని వెంగళరావు నగరంలో మూడు ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. మార్కెట్ విలువ సుమారు రూ.600 కోట్ల వరకు ఉండే ఈ భూమిపై కొనసాగుతున్న ఆక్రమణలను గుర్తించిన అధికారులు బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమి అని సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
1975 కంటే ముందే సంబంధిత వ్యక్తులకు పరిహారం చెల్లించి సుమారు 45 ఎకరాల భూమిని హౌసింగ్ బోర్డు సేకరించింది. ఆ భూమిపై 660 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులు, ప్రజావసరాల కోసం కొన్ని స్థలాలను కేటాయించింది. వెంగళరావు నగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ఐదు ఎకరాల భూమిని ప్రజా అవసరాల కోసం ఖాళీగా ఉంచారు. అయితే ఇందులో ఇప్పటికే రెండు ఎకరాల వరకు ఆక్రమణలు జరిగి శాశ్వత నిర్మాణాలు ఏర్పడ్డాయి. మిగిలిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిపై తాజాగా ఆక్రమణలు పెరగడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హౌసింగ్ బోర్డు నుంచి గతంలో పరిహారం తీసుకున్న కొంతమంది వ్యక్తులతో పాటు మరో మూడు గ్రూపులు ఈ భూమి తమదేనని చెబుతూ ఆక్రమణలకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమిపై హక్కు ఉందని చెబుతున్న వారందరితో హైడ్రా సమావేశం ఏర్పాటు చేసి వారి పత్రాలను పరిశీలించింది. అయితే ఎవరి వద్దా సరైన ఆధారాలు లేవని అధికారులు నిర్ధారించారు. ఇదే సమయంలో ఈ భూమి తమదేనని చెబుతున్న కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు స్టే కొనసాగుతున్నప్పటికీ అక్కడ కొత్తగా గుడిసెలు వేయడం, షెడ్డులు నిర్మించడం, వివిధ వ్యాపారాలు నిర్వహించడం వంటి చర్యలు కొనసాగుతున్నట్లు స్థానికులు ఫిర్యాదులు చేశారు. మీడియాలో కూడా ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కథనాలు రావడంతో హైడ్రా అధికారులు బుధవారం ఆక్రమణలను తొలగించి మూడు ఎకరాల భూమిని రక్షించారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా స్పష్టంగా గుర్తింపులు ఏర్పాటు చేశారు.
Comments
