విద్యా కమిషన్ నివేదికపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు
విద్యా కమిషన్ నివేదికపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు
ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని ఆరోపణ
కేసీఆర్ అధికారంలోకి వస్తే నివేదిక చెత్తబుట్టలో వేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, మార్చి 1 (పీపుల్స్ మోటివేషన్): విద్యా కమిషన్ సమర్పించిన నివేదికపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ నివేదిక లక్షా డెబ్బై వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన, రెండేళ్ల రెండు నెలల రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థపై కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఈ విద్యా కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేస్తామని స్పష్టం చేశారు
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమీక్షించకుండా పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని వ్యాఖ్యానించడం తగదని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయుల జీతాలను కమిషన్ నిర్ణయించాల్సిన అవసరం లేదని, వేతన పునర్వ్యవస్థీకరణ కమిషన్ నిర్ణయించాల్సిందేనని తెలిపారు. ఉపాధ్యాయులకు పరీక్షలు పెట్టి పదోన్నతులు ఇవ్వాలన్న సిఫార్సు అన్యాయమని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా ఇలాంటి పరీక్షలు పెడతారా అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ఇరవై ఐదు వేల పాఠశాలలను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. గురుకుల పాఠశాలలు, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, క్రీడా అకాడమీలు స్థాపించబడిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆకునూరి మురళిని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయాలన్న సిఫార్సు పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. గురుకులాలను క్రమంగా రద్దు చేయాలన్న సూచన కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే కుట్రగా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా విద్యా వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు రావాలంటే ఉపాధ్యాయుల జీతాలు గౌరవప్రదంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ డబ్బును కేసీఆర్‌ను విమర్శించేందుకు దుర్వినియోగం చేయరాదని హెచ్చరించారు. ఈ నివేదిక అమలైతే తెలంగాణ విద్యా వ్యవస్థ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
