ప్రజావాణి కార్యక్రమంలో వినతులపై సమీక్ష
ప్రజావాణి కార్యక్రమంలో వినతులపై సమీక్ష
- మంత్రి పొన్నం ప్రభాకర్
- ప్రజల సమస్యలపై ప్రత్యక్ష విచారణ
- ఇళ్ల, పింఛన్లు, భూ సమస్యలపై అధికారులకు ఆదేశాలు
- ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక పర్యవేక్షణ
హైదరాబాద్, మార్చి 31 (పీపుల్స్ మోటివేషన్): హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు అందజేయడానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజలు వినతులు సమర్పించారు. పింఛన్లు, ధరణి ద్వారా భూ రికార్డుల్లో సమస్యలు, భూ భారతి సంబంధిత అంశాలపై కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులతో చర్చించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదుపై అధికారులు చొరవ తీసుకుని పరిష్కారం చూపాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే సమస్యలను సమయానికి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కూడా మంత్రి స్పందించారు. వివిధ కారణాల వల్ల సేవల నుంచి తొలగించబడిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని త్రిమెన్ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. సంబంధిత అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో మంత్రి సమావేశమై ప్రజావాణి దరఖాస్తులు, వాటి పరిష్కారంపై చర్చించారు. పోలీస్ కేసులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
