ఇరాన్‌కు అండగా కాశ్మీర్ ప్రజలు
ఇరాన్‌కు అండగా కాశ్మీర్ ప్రజలు
- భారీగా విరాళాల సేకరణ
- బంగారం, నగదు, వెండి విరాళాలు
- మహిళలు, చిన్నారుల సహకారం విశేషం
- యుద్ధ ప్రభావితులకు మానవతా సాయం
శ్రీనగర్, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో నష్టపోయిన ఇరాన్ ప్రజలకు మద్దతుగా కాశ్మీర్ ప్రాంత ప్రజలు ముందుకొచ్చారు. పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా విరాళాల సేకరణ చేపట్టి, తమకు ఉన్నంతలో సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు బంగారం, నగదు, వెండి, రాగి వస్తువులను విరాళంగా అందజేస్తున్నారు. ఒక మహిళ తన వద్ద ఉన్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చి మానవతా దృక్పథాన్ని చాటారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే చిన్నారులు కూడా తమ కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును విరాళంగా ఇవ్వడం విశేషం. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమవంతు సహాయం చేయడానికి ముందుకు రావడం గమనార్హం. ప్రజల్లో ఉన్న మానవత్వం, సహానుభూతి ఈ ఘటన ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఈ విరాళాలను సేకరించి బాధితులకు అందించేందుకు స్థానిక సంఘాలు ముందుకు వచ్చాయి. యుద్ధం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సహాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి మానవతా చర్యలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవడం మనుష్యత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.
