జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌కు శంకుస్థాపన
జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైం షిప్ యార్డ్‌కు శంకుస్థాపన
- మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం
- దేశంలోనే తొలి అటానమస్ మారిటైం సిస్టమ్స్ కేంద్రం
- రూ.45 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు
నెల్లూరు, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు రక్షణ రంగాల్లో మరో కీలక ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. శంకుస్థాపన కార్యక్రమానికి జువ్వలదిన్నె చేరుకున్న మంత్రి లోకేశ్‌కు సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం కూటమి ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో 29.58 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ భూమి కూడా ఉంది. ప్రథమ దశలో సాగర్ డిఫెన్స్ సంస్థ రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. షిప్ బిల్డింగ్, అటానమస్ సిస్టమ్స్ అభివృద్ధి, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన-అభివృద్ధి వంటి రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. 2026 నవంబర్ నాటికి ఈ కేంద్రంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును 200 ఎకరాల్లో విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటుతో బ్లూ ఎకానమీ, సముద్ర సాంకేతిక ఆవిష్కరణలు బలోపేతం కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను మారిటైం రోబోటిక్స్ మరియు అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ముందుగా జిల్లాకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు బోగోలు మండలం కప్పరాలతిప్ప వద్ద నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, పి. సునీల్ కుమార్, ఎన్. విజయశ్రీ, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు, సాగర్ డిఫెన్స్ సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్ తదితరులు పాల్గొన్నారు.
