ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్‌పై హైకోర్టు సీరియస్
ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్‌పై హైకోర్టు సీరియస్
- ప్రమాణాలు లేకపోతే జరిమానా హెచ్చరిక
- షిర్డీ సాయి సరఫరాపై నాణ్యత పరీక్షలు
- సీబీఐ విచారణ కోరుతూ పిల్‌పై నోటీసులు
- ధరల్లో భారీ వ్యత్యాసాలపై కోర్టు దృష్టి
అమరావతి, మార్చి 19 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్ కేటాయింపు, సరఫరా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే జరిమానాలు విధిస్తామని స్పష్టంగా హెచ్చరించింది. 2021 నుంచి టెండర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ట్రాన్స్‌ఫార్మర్ల నాణ్యతపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిపుణులతో సమగ్ర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సరఫరా చేసిన పరికరాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే సంబంధిత సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్‌కో, ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు, షిర్డీ సాయి సంస్థకు కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, టెండర్ నిబంధనలు షిర్డీ సాయి సంస్థకు అనుకూలంగా రూపొందించారని ఆరోపించారు. తెలంగాణలో ఇదే ప్రమాణాల ట్రాన్స్‌ఫార్మర్లు రూ.85 వేలకే అందుబాటులో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.1.39 లక్షలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌పై సుమారు రూ.55 వేల వరకు అధిక ధర వసూలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా, టెండర్ ప్రకారం 5 స్టార్ రేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేయాల్సి ఉండగా, 3 స్టార్ రేటింగ్ పరికరాలే అందించారని ఆరోపించారు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ, షిర్డీ సాయి సంస్థ 2022 నుంచి సరఫరా చేస్తోందని, ఇప్పుడే పిల్ దాఖలు చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. పిటిషనర్ పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. అదే సమయంలో పిటిషనర్ సేవ విరమణ అనంతరం ప్రజాహిత దృష్టితో ఈ పిల్ దాఖలు చేసి ఉండవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు, నాణ్యత, ధరల విషయంలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు జరగనున్న నాణ్యత పరీక్షలు, తదుపరి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
