నీటి యుద్ధాలు రాకముందే మేల్కొందాం: హైడ్రా కమిషనర్ హెచ్చరిక
నీటి యుద్ధాలు రాకముందే మేల్కొందాం: హైడ్రా కమిషనర్ హెచ్చరిక
- జేఎన్‌టీయూలో వరల్డ్ వాటర్ డే వేడుకలు
- చెరువుల పునరుద్ధరణతో నగరానికి భద్రత
- ఆక్రమణలపై కఠిన చర్యలతో హైడ్రా ముందడుగు
హైదరాబాద్, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి రాకముందే సమాజం అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. జేఎన్‌టీయూలో వరల్డ్ వాటర్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో చమురు కోసం యుద్ధాలు జరుగుతున్నప్పటికీ, భవిష్యత్తులో నీటి వనరుల కోసం కూడా ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. నగర జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరుల పరిరక్షణ అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ప్రస్తుతం సుమారు 1.60 కోట్లుగా ఉన్న నగర జనాభా 2050 నాటికి 3 కోట్లకు చేరే అవకాశముందని పేర్కొన్నారు. ఈ పెరుగుదలకు అనుగుణంగా నగర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తోందని, హైడ్రా ఆ దిశగా వేగంగా పనిచేస్తోందని తెలిపారు.
మొదటి దశలో ఆరు చెరువుల పునరుద్ధరణలో మూడు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మిగిలిన మూడు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. రెండో దశలో మరో 18 చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా వర్షాకాలంలో వరదలను నియంత్రించడమే కాకుండా, భూగర్భ జలాల పెరుగుదలకు కూడా సహాయపడుతుందని వివరించారు. నగరంలో చెరువులపై జరిగిన ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ డేటా ప్రకారం 1975 నుంచి 2023 మధ్య నగరంలో 61 శాతం చెరువులు కనుమరుగయ్యాయని, మరో 15 ఏళ్లలో మిగిలినవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఒకప్పుడు 1300 చెరువులు ఉండగా, ప్రస్తుతం సుమారు 700 చెరువులు మాయం అయ్యాయని తెలిపారు. మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువును ఉదాహరణగా చూపిస్తూ, ఆక్రమణలను తొలగించి చెరువు విస్తీర్ణాన్ని 14 ఎకరాల నుంచి 29 ఎకరాలకు పెంచినట్లు చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఇప్పుడు చెరువుల పరిధిలో నిర్మాణాలకు ప్రజలు ముందుకు రావడం లేదని తెలిపారు. హైడ్రా చర్యల ఫలితంగా చెరువులు పిక్నిక్ స్పాట్లుగా మారుతున్నాయని చెప్పారు.
భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఆక్రమణలపై మౌనం ప్రమాదకరమని, ప్రజల ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటివరకు 1350 ఎకరాల భూమిని కాపాడినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని నీటి వనరుల పరిరక్షణ అవసరాన్ని వివరించారు. చెరువుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు నగర భవిష్యత్తుకు కీలకమని వారు అభిప్రాయపడ్డారు.
