ఖమేనీ మృతిపై పుతిన్ తీవ్ర ఆగ్రహం
ఖమేనీ మృతిపై పుతిన్ తీవ్ర ఆగ్రహం
‘కిరాతక హత్య’గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు
ఇరాన్‌కు సంఘీభావం, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా వ్యాఖ్య
మాస్కో, మార్చి 1 (పీపుల్స్ మోటివేషన్): ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన ‘కిరాతక హత్య’గా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, మానవత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించిన చర్య అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు పుతిన్ లేఖ రాశారు. ఖమేనీని అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా గుర్తుంచుకుంటామని, రష్యా–ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ సైనికాధికారులు మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్ నలభై రోజుల సంతాపాన్ని ప్రకటించింది. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం తమ హక్కు, బాధ్యత అని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు స్పందిస్తూ అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు జరగాలని సూచించారు. ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో, ముఖ్యంగా రష్యా–ఇరాన్ సంబంధాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
