ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
హైదరాబాద్, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్):
ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకునేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిద్ధమవుతోంది. ఏళ్లుగా వాడకంలో లేకుండా ఉన్న ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాల్లోని డబ్బులను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా చర్యలు చేపడుతోంది.
ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, ఖాతాదారులు ప్రత్యేకంగా క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా, వారి ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయి. ఇందుకోసం ప్రత్యేక ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను తీసుకురానుంది.
ప్రాథమికంగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన సుమారు 8 లక్షల ఇనాక్టివ్ ఖాతాలను ప్రాసెస్ చేయాలని యోచిస్తోంది. ఈ ఖాతాల్లో దాదాపు రూ.5,200 కోట్ల నిధులు ఉన్నట్లు అంచనా. వీటిలో 14 వేల ఖాతాల్లో రూ.5 లక్షలకు పైగా, మరో 38 వేల ఖాతాల్లో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య డబ్బులు ఉన్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 31 లక్షల ఇనాక్టివ్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించగా, వాటిలో రూ.10,181 కోట్ల వరకు నిధులు క్లెయిమ్ కాకుండా మిగిలిపోయాయి. ఇందులో 20 ఏళ్లకు పైబడిన ఖాతాలు 7 లక్షలు, 10 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నవి 18 లక్షలు ఉన్నట్లు సమాచారం.
సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ తర్వాత మూడు సంవత్సరాల పాటు ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకపోతే ఆ ఖాతాను ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ ఖాతాలపై వడ్డీ జమ ఆగిపోతుంది.
ఇప్పటికే రూ.1,000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేయడానికి అనుమతి లభించగా, తాజా ప్రతిపాదన దానికి విస్తరణగా భావిస్తున్నారు. అయితే ఈ కొత్త విధానంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
మొత్తానికి, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కోట్లాది మంది ఖాతాదారులకు సులభంగా తమ పీఎఫ్ డబ్బులు తిరిగి పొందే అవకాశం లభించనుంది.
