ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం.. అమలుకు సిద్ధమైన కేంద్రం
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం.. అమలుకు సిద్ధమైన కేంద్రం
హైదరాబాద్, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్):
దేశంలో కొత్త ఆదాయ పన్ను వ్యవస్థకు శ్రీకారం చుట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘కొత్త ఆదాయ పన్ను చట్టం-2025’ను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు పొందిన ఆదాయానికి పాత ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారమే పన్నులు లెక్కించి రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రభావం 2026-27 ఆర్థిక సంవత్సరంలో సంపాదించే ఆదాయంపై మాత్రమే ఉంటుందని నిపుణులు వివరించారు.
ఈ మార్పులను దశలవారీగా అమలు చేయడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పటికే ‘ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ను నోటిఫై చేసింది. ఈ కొత్త విధానంలో పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరటనిచ్చే మార్పులు కూడా ఉన్నాయి.
వేతన జీవులకు ముఖ్యంగా హెచ్‌ఆర్‌ఏ మినహాయింపుల పరిమితిని పెంచడం, 50 శాతం హెచ్‌ఆర్‌ఏ కేటగిరీలోకి మరిన్ని నగరాలను చేర్చడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లల విద్య అలవెన్స్‌ను నెలకు రూ.3,000, హాస్టల్ అలవెన్స్‌ను రూ.9,000 వరకు పెంచారు.
అదే సమయంలో, హెచ్‌ఆర్‌ఏ వంటి మినహాయింపులకు సంబంధించిన డాక్యుమెంటేషన్, డిక్లరేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. పన్ను వ్యవస్థను సులభతరం చేయడానికి ‘ఫైనాన్షియల్ ఇయర్’, ‘అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘ట్యాక్స్ ఇయర్’ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఇక ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ను మరింత సులభంగా చేయడానికి కొత్త ఫార్మాట్‌లు, నంబరింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు స్పష్టత పెరిగి, సందిగ్ధత తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, కొత్త ఆదాయపన్ను చట్టం అమలుతో పన్ను వ్యవస్థలో సరళత, పారదర్శకత పెరగనుందని అధికారులు చెబుతున్నారు.
