పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
- ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో చర్చ
- భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత
- ఎల్పీజీ కొరతపై వదంతులను ఖండించిన ప్రధాని
న్యూఢిల్లీ, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్): పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ, ప్రాంతీయ భద్రత మరియు శాంతి స్థాపనపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల విధ్వంసం వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నివసిస్తున్న భారతీయుల భద్రత, క్షేమమే భారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు. సరకు రవాణా, ఇంధన సరఫరా వంటి అంశాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల ద్వారా రవాణా నిరంతరాయంగా సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. హింసకు ముగింపు పలికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు.
పశ్చిమాసియా దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఇరాన్‌లో సుమారు తొమ్మిది వేల మంది, ఇజ్రాయెల్‌లో నలభై వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు భారత రాయబార కార్యాలయం సహాయంతో స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా వారిని కూడా సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ దేశంలో ఎల్పీజీ కొరత ఉందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ పరిస్థితులను అడ్డంగా పెట్టుకుని కొన్ని వస్తువులను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అలాంటి అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. 2014కి ముందు దేశంలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం దేశంలో ఐదు మిలియన్ టన్నులకు పైగా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. గత దశాబ్దంలో దేశ శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాన్ని కూడా దేశం సమర్థంగా ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
