ఆరోగ్య భీమా పథకంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
ఆరోగ్య భీమా పథకంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
ప్రైవేటు భీమాతో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన
బకాయిల విడుదలకు ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ నేత
అమరావతి, మార్చి 1 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో అమలు చేస్తున్న రెండున్నర లక్షల ఆరోగ్య భీమా పథకం పచ్చి మోసమని వైఎస్ షర్మిల ఆరోపించారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరిట ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని విమర్శించారు. పేదల ప్రాణాలను కాపాడే ఆరోగ్యశ్రీని ప్రైవేటు భీమాకు అనుసంధానం చేయడం దురుద్దేశపూర్వక చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ ట్రస్ట్ విధానంలో నడిచే ఆరోగ్యశ్రీకి బదులుగా ప్రైవేటు భీమా అమలు చేయడం ద్వారా ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద నాలుగు వేల కోట్ల రూపాయల చెల్లింపులు చేయడానికి వెనుకాడుతున్న ప్రభుత్వం, ప్రైవేటు భీమా కంపెనీలకు వేల కోట్లు ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకం పేద కుటుంబాలకు సంజీవని వంటిదని ఆమె వ్యాఖ్యానించారు.
రెండున్నర లక్షల రూపాయల వరకు భీమా, ఆపై ఖర్చును ట్రస్ట్ భరించడం వంటి నిబంధనలలో స్పష్టత లేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు ప్రైవేటు భీమా విధానం నుంచి ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మారుతున్న వేళ, మన రాష్ట్రంలో విరుద్ధ నిర్ణయం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటుకు అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ షర్మిల కోరారు. ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీని నడపాలని, ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
