ధాన్యం ధరలు పడిపోవడం ఆందోళనకరం.. కాకాణి విమర్శలు
ధాన్యం ధరలు పడిపోవడం ఆందోళనకరం.. కాకాణి విమర్శలు
- కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్
- రైతుల పక్షాన పోరాటానికి హెచ్చరిక
- కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
నెల్లూరు, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకు తగ్గిపోవడం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొట్లపాలెం గ్రామంలో పర్యటించిన ఆయన రైతుల సమస్యలపై స్పందించారు.
ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ధాన్యం ధరలు తగ్గకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోకపోతే రైతులతో కలిసి అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు ఇబ్బందులు పెరిగాయని కాకాణి విమర్శించారు. యూరియా సరఫరా ఆలస్యం, సాగునీటి కొరత, ఇరిగేషన్ పనుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన ధర దక్కకపోవడం బాధాకరమని అన్నారు. ధాన్యం దిగుబడులు పెరిగినప్పటికీ దళారులు, వ్యాపారులు, మిల్లర్లు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించడం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర వచ్చే వరకు రైతులతో కలిసి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
