ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం.. అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం.. అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్
- బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లు
- స్థలాలు, యంత్రాలు తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం
- శ్రీకాకుళం రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి
శ్రీకాకుళం, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు స్థలాలు కొనిపెడతానని చెప్పి కోట్ల రూపాయలు మోసం చేసిన అంతర్రాష్ట్ర నిందితుడిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద మంగళవారం వెల్లడించారు.
అరెస్టైన నిందితుడు గొల్ల బెనర్జీ అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి (33)గా గుర్తించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఓవ్వేరు గ్రామానికి చెందిన అతడు ప్రస్తుతం నెల్లూరులో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్ వరకు చదివిన అనంతరం సీఏ కోర్సులో చేరి మధ్యలోనే మానేసిన అతడు అకౌంట్స్‌పై కొంత పరిజ్ఞానం సంపాదించి మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. విశాఖపట్నంలో నివసిస్తున్న దేశెట్టి రమణమూర్తిని నిందితుడు సుమారు రూ.1 కోటి 5 లక్షల వరకు మోసం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. తాను ఢిల్లీలో సెంట్రల్ జోనల్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని, పలు బ్యాంకుల రిక్రూట్మెంట్ బోర్డులో సభ్యుడినని అబద్ధాలు చెప్పి ఎస్‌బీఐలో బ్యాక్లాగ్ పోస్టుల కింద ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తే నియామకం కల్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా శ్రీకాకుళం చిన్నబజార్ ప్రాంతంలో 8 సెంట్ల స్థలాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పి రూ.86 లక్షలు తీసుకున్నాడు. అలాగే రూ.29 లక్షల విలువైన గోల్డ్ క్రాఫ్ట్ యంత్రాన్ని రూ.14 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి కూడా డబ్బులు తీసుకుని ఎటువంటి వస్తువు ఇవ్వకుండా మోసం చేసినట్లు విచారణలో తేలింది. శ్రీకాకుళం జిల్లాలో మోసం బయటపడటంతో విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా నిరుద్యోగులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా పలువురిని మోసం చేసి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిపై నెల్లూరు, తాడేపల్లిగూడెం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పలుచీటింగ్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌కు తరలించింది.
Comments
