తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మండలిలో తీవ్ర వాగ్వాదం
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మండలిలో తీవ్ర వాగ్వాదం
- వైసీపీ ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు
- దేవుడిపై తమ కుటుంబానికి అపార భక్తి ఉందని స్పష్టం
- కల్తీ జరిగిందని దర్యాప్తు సంస్థలే చెప్పాయని వ్యాఖ్య
అమరావతి, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెరిటేజ్ డెయిరీపై ఆరోపణలు చేయగా మంత్రి లోకేశ్ వెంటనే స్పందించారు. సభలో ఆరోపణలు చేయాలంటే కచ్చితమైన ఆధారాలతో రావాలని సూచించారు. టెండర్ల ప్రక్రియలో నిబంధనల ప్రకారం అత్యల్ప ధరకు కోట్ చేసిన వారికి మాత్రమే కాంట్రాక్ట్ లభిస్తుందని, కనీస అవగాహన లేకుండా మాట్లాడటం తగదని అన్నారు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుందని చురకలంటించారు.
తమ కుటుంబానికి శ్రీ వేంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి ఉందని లోకేశ్ చెప్పారు. గత పదేళ్లుగా తన కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రోటోకాల్ అర్హత ఉన్నప్పటికీ ఎప్పుడూ మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించలేదని, సామాన్య భక్తుల మాదిరిగానే క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కూడా లోకేశ్ విమర్శలు చేశారు. తిరుమల దర్శనానికి అవసరమైన డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి కూడా జగన్ ముందుకు రాలేదని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో తమ భక్తిని ప్రశ్నించడం సరికాదని అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం దర్యాప్తు సంస్థల నివేదికల్లో స్పష్టంగా ఉందని లోకేశ్ తెలిపారు. గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. మార్కెట్‌లో స్వచ్ఛమైన నెయ్యి ధర ఎంత ఉందో చూసినా విషయం అర్థమవుతుందని, తక్కువ ధరకు సరఫరా చేయాలంటే కల్తీ చేయక తప్పదని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. కల్తీ జరగలేదని చెప్పడం సిగ్గుచేటని, కలియుగ దైవంతో ఆటలాడుకున్న వారిని దేవుడే క్షమించడని ఘాటుగా వ్యాఖ్యానించారు.
