అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు
అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు
ఇస్లామాబాద్, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. దాదాపు మూడేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఆయన ఇక రిటైర్మెంట్‌కు సమయం వచ్చిందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దాదాపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికినట్టైంది.
పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో విజయవంతమైన సారథులలో ఒకరిగా గుర్తింపు పొందిన సర్ఫరాజ్ అహ్మద్, మొత్తం వంద అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. “పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. అండర్–19 జట్టును 2006లో విజేతగా నిలపడం, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం నా కెరీర్‌లో ప్రత్యేక క్షణాలు” అని తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.
కరాచీలో జన్మించిన సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా 2007లో భారత జట్టుపై వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో మొత్తం 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు పట్టడంతో పాటు 56 స్టంపౌట్లు చేసి మంచి గుర్తింపు పొందాడు.
కెప్టెన్‌గా కూడా జట్టును అద్భుతంగా నడిపించాడు. ముఖ్యంగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టును ఓడించి పాకిస్థాన్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు. ఇకపై కూడా పాకిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని సర్ఫరాజ్ తెలిపాడు. ఆయన భవిష్యత్తులో కోచ్‌గా జట్టుతో పని చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
