తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా చేర్చిన ట్రాఫిక్ పోలీసులు
తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా చేర్చిన ట్రాఫిక్ పోలీసులు
- సమయస్ఫూర్తితో స్పందించిన ఎస్సై శేషగిరిరావు
- హైవే వద్ద గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం
- పోలీసుల మానవత్వానికి ప్రశంసలు
అనకాపల్లి, మార్చి 29 (పీపుల్స్ మోటివేషన్): అనకాపల్లి పట్టణంలో తప్పిపోయిన పదేళ్ల బాలుడిని ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన స్థానికంగా పోలీసుల సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ట్రాఫిక్ ఎస్సై శేషగిరిరావును అధికారులు అభినందించారు.
పరవాడ మండలం మరిసవాణిపాలెం గ్రామానికి చెందిన కొండలరావు కుమారుడు భూగిది జోషిత్ (10), కుటుంబ సభ్యులతో కలిసి అనకాపల్లి నూకాలమ్మ తల్లి దర్శనం కోసం వచ్చాడు. జనసమ్మర్దంలో తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఆందోళనకు గురయ్యాడు.
దిక్కుతోచని స్థితిలో బాలుడు అనకాపల్లి జాతీయ రహదారి జంక్షన్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై శేషగిరిరావు బాలుడిని గమనించి వెంటనే తన వద్దకు తీసుకుని ధైర్యం చెప్పారు. బాలుడి నుండి వివరాలు సేకరించి తండ్రి ఫోన్ నంబర్‌ను గుర్తించారు.
తక్షణమే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు హైవే జంక్షన్ వద్దకు చేరుకున్నారు. అప్పటివరకు ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమ కుమారుడిని క్షేమంగా చూసి ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బాలుడిని సురక్షితంగా వారి చేతుల్లోకి అప్పగించారు.
ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తక్షణ స్పందనతో తమ బిడ్డను కాపాడినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల మానవత్వం తమను కదిలించిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ ఎస్సై శేషగిరిరావు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
