తిరుమలలో అత్యాధునిక ఆహార పరీక్షా కేంద్రం ప్రారంభం
తిరుమలలో అత్యాధునిక ఆహార పరీక్షా కేంద్రం ప్రారంభం
- ప్రసాదాల నాణ్యత పెంపుకు కీలక చర్య
- రూ.25 కోట్లతో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్
- భక్తులతో మమేకమైన ముఖ్యమంత్రి
తిరుమల, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. స్టేట్ ఫుడ్ లాబరేటరీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన అత్యాధునిక వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి, పప్పులు వంటి ముడిసరుకుల నాణ్యతను నిరంతరం పరీక్షించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు వచ్చిన ఆయన, తన ఆనవాయతీ ప్రకారం సామాన్య భక్తుడిలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లడం విశేషం. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ట్రస్టుకు విరాళం ఇవ్వడం చంద్రబాబు కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఒకరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని అందజేశారు. గతంలో కూడా ఇదే విధంగా పలుమార్లు విరాళాలు అందజేసినట్లు సమాచారం. భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమానికి ఈ విరాళం ఉపయోగపడనుంది. దర్శనానంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి వెళ్లి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. భక్తులతో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తుల మధ్య కలిసిమెలిసి ఉండడం ద్వారా ఆయన సరళత మరోసారి స్పష్టమైంది.
తిరుమలలో అందుతున్న సౌకర్యాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఆధునిక సాంకేతికత వినియోగంతో భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
