స్మార్ట్‌ఫోన్ వినియోగంపై హెచ్చరిక
స్మార్ట్‌ఫోన్ వినియోగంపై హెచ్చరిక
- - యువతికి సీపీ సజ్జనార్ సూచనలు
- - సోషల్ మీడియా పరిచయాలు ప్రమాదకరం
- - నకిలీ ఖాతాలతో మోసాలు పెరుగుదల
- - అప్రమత్తంగా ఉండాలని పిలుపు
మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో యువతులు, ముఖ్యంగా ఆడపిల్లలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా అపరిచితులతో ఏర్పడే పరిచయాలు ఊహించని సమస్యలకు దారి తీస్తున్నాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదికలో స్పందిస్తూ యువతికి కీలక సూచనలు చేశారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి, ఆకర్షణీయమైన ఫోటోలు ఉపయోగించి యువతులను మోసం చేసే ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. అపరిచితులు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, మాయమాటలతో నమ్మకం పొందిన తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సేకరించి దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు.
ఈ ఫోటోలు చేతికి అందిన వెంటనే నేరగాళ్లు బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని, డబ్బులు డిమాండ్ చేయడం లేదా వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి తెస్తున్నారని సీపీ తెలిపారు. పరువు పోతుందనే భయంతో బాధితులు ఈ విషయాన్ని బయటపెట్టకుండా మానసిక ఒత్తిడికి లోనవుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా వెంటనే కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలని, పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు. పోలీసులు ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలుస్తారని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. నకిలీ ఖాతాలు, వర్చువల్ నెంబర్లు వాడి తప్పించుకోగలమని భావించే సైబర్ నేరగాళ్లను ఎక్కడున్నా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత సోషల్ మీడియాను బాధ్యతతో వినియోగిస్తూ, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
