అబ్రార్ ఒక్కడే కాదు.. భారత ఫ్రాంచైజీల్లో మరికొందరు పాక్ ఆటగాళ్లు
అబ్రార్ ఒక్కడే కాదు.. భారత ఫ్రాంచైజీల్లో మరికొందరు పాక్ ఆటగాళ్లు
న్యూఢిల్లీ, మార్చి 13 (పీపుల్ మోటివేషన్ ):
ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేయడం ఇటీవల వివాదానికి దారితీసింది. కావ్యా మారన్ నేతృత్వంలోని ఈ జట్టు అతనిని సుమారు రూ.2.34 కోట్లకు తీసుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అబ్రార్ అహ్మద్ మాత్రమే కాకుండా, ఇప్పటికే పలు విదేశీ లీగ్‌లలో భారత ఫ్రాంచైజీలకు చెందిన జట్లలో మరికొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఆడిన విషయం బయటపడింది.
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్, స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఈ జట్టుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానులు అయిన షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా భాగస్వాములుగా ఉన్నారు.
అలాగే అమెరికాలో నిర్వహించే మేజర్ లీగ్ క్రికెట్‌లో సీటెల్ ఆర్కాస్ జట్టు తరఫున పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం గత సీజన్‌లో ఆడాడు. ఈ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంలో భాగమైన జీఎంఆర్ గ్రూప్‌కు చెందినది.
ఇక అంతర్జాతీయ లీగ్ టీ20లో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. 2023–24 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన అబుదాబి జట్టు తరఫున ఇమాద్ వసీం ఆడగా, మరో పాకిస్థాన్ క్రికెటర్ ఉస్మాన్ ఖాన్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు.
దీంతో విదేశీ లీగ్‌లలో భారత ఫ్రాంచైజీలు పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోవడం ఇదే తొలిసారి కాదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అబ్రార్ అహ్మద్ కొనుగోలు నేపథ్యంలో ఈ విషయం మళ్లీ చర్చకు వచ్చింది.
