కావ్య మారన్ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
కావ్య మారన్ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
ముంబై, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):
‘ది హండ్రెడ్’ లీగ్ వేలంలో జరిగిన ఒక పరిణామం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన అనుబంధ జట్టు సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేయడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు.
సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా ఉన్న కావ్య మారన్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ నిర్ణయంపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ విషయంపై స్పందించిన సునీల్ గవాస్కర్, కావ్య మారన్‌పై వస్తున్న విమర్శలు అర్థం చేసుకోదగినవేనని అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చలు సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ఆటగాడికి చెల్లించే డబ్బు అక్కడి ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్తుందని, ఆ డబ్బును ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియన్ యజమాన్యం ఉన్న ఫ్రాంచైజీ పాకిస్థాన్ ఆటగాడిని తీసుకోవడం వల్ల భారతీయుల ప్రాణాలకు పరోక్షంగా ముప్పు కలిగించే పరిస్థితి ఏర్పడుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఒక టోర్నమెంట్ గెలవడం భారతీయుల ప్రాణాల కంటే ముఖ్యమా అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.
‘ది హండ్రెడ్’ లీగ్‌లో జట్టు కోచ్ న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరి కావడంతో పాకిస్థాన్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని భావించి ఉండవచ్చని గవాస్కర్ అన్నారు. అయితే తుది నిర్ణయం తీసుకునే సమయంలో యజమాన్యం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
