గిరిజన గ్రామాలకు జీవనాడిగా రహదారులు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గిరిజన గ్రామాలకు జీవనాడిగా రహదారులు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
- ఓనూరు – నందిగరువు పీఎం జన్మన్ రహదారి పరిశీలన
- 655 గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ కల్పించే భారీ ప్రణాళిక
- కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి పనులు
పాడేరు, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్): అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పరిధిలోని ఓనూరు – నందిగరువు మధ్య నిర్మిస్తున్న పీఎం జన్మన్ రహదారి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మారుమూల గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ కల్పించే ఈ రహదారులు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పీవీటీజీ గిరిజన సముదాయాలకు ఈ రహదారులు జీవనాడిలా మారనున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం ద్వారా ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక గ్రామాలకు ఈ రహదారులు పెద్ద మార్పు తీసుకురానున్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం సహా కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో భారీ స్థాయిలో రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 655 గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ కల్పించేందుకు సుమారు 1,069 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ.1005 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రహదారులు పూర్తయ్యే సరికి ఎన్నో మారుమూల గ్రామాలు రవాణా సౌకర్యంతో అనుసంధానమవుతాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు ఇప్పుడు రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తోందని తెలిపారు. గిరిజన సంక్షేమంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపుతున్న చొరవకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం కీలకమని చెప్పారు. రాష్ట్రంలోని చివరి గ్రామం వరకు అభివృద్ధి చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
