మొబైల్ డేటాపై పన్ను ప్రతిపాదన.. వినియోగదారుల్లో ఆందోళన
మొబైల్ డేటాపై పన్ను ప్రతిపాదన.. వినియోగదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):
మొబైల్ డేటా వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త షాక్ ఇవ్వవచ్చనే చర్చ జరుగుతోంది. మొబైల్‌లో వినియోగించే ప్రతి జీబీ డేటాపై ₹1 పన్ను విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశంపై టెలికమ్యూనికేషన్ విభాగానికి అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉన్నప్పటికీ, అమల్లోకి వస్తే మొబైల్ డేటా వినియోగంపై అదనపు భారం పడే అవకాశం ఉంది. వినియోగదారులు ఉపయోగించే ప్రతి జీబీ డేటాపై ₹1 పన్ను విధిస్తే ప్రభుత్వానికి సుమారు ₹22,900 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టెలికాం సేవలపై ఇప్పటికే 18 శాతం పన్ను అమల్లో ఉంది.
ఇది అమల్లోకి వస్తే వీడియోలు చూడటం, సామాజిక మాధ్యమాలు వినియోగించడం, ఆన్‌లైన్ సేవలు ఉపయోగించడం వంటి అన్ని సందర్భాల్లో ఉపయోగించే డేటాపై అదనంగా ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొబైల్ డేటా వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధానం భారతదేశంలో అమలు చేయడం సాధ్యమా అనే అంశంపై టెలికమ్యూనికేషన్ విభాగం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. నిర్ణయం తీసుకున్న తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
