Free Bus: సాయంతో పాటు ఖర్చులూ తగ్గిస్తున్నాం
Free Bus: సాయంతో పాటు ఖర్చులూ తగ్గిస్తున్నాం
* దివ్యాంగశక్తి పథకంతో దివ్యాంగులకు ఆత్మగౌరవం
* దివ్యాంగులకు ఎల్లప్పుడూ సంక్షేమాన్ని ఇచ్చేది మేమే
* దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
* మంగళగిరి నుంచి పెనుమాక వరకూ వారితో కలిసి ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్
* తన నివాసంలో దివ్యాంగులకు సీఎం ఆత్మీయ విందు
* దివ్యాంగుల ముసుగులో లబ్దిపొందుతున్న వారిని ఏరి వేయాలని సీఎంకు వినతి
అమరావతి, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్):-
దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులు సాధికారత సాధించడానికి.. వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మొత్తంగా 21 కేటగిరీల బస్సుల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దివ్యాంగుల వెంట వచ్చే సహాయకులతో కలిపి మొత్తంగా 12.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్ల రూపాయల ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. దివ్యాంగుల శక్తి పథకానికి సంబంధించిన ఈ నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. పథకం ప్రారంభించిన సందర్భంగా మంగళగిరి బస్టాండ్ నుంచి రాజధానిలోని పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిలో మీటర్ల మేర దివ్యాంగులతో ప్రయాణించిన నేతలు.. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పథకాలను.. కార్యక్రమాలను వివరించారు. ఈ పథకం ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు. దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసిన అనంతరం తన నివాసంలో దివ్యాంగ శక్తి పథకంలోని పలువురు లబ్దిదారులకు సీఎం ఆత్మీయ విందు ఇచ్చారు. విందుకు వచ్చిన వారిని ముఖ్యమంత్రి అప్యాయంగా పలకరించారు. వారితో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. తమ వెంట వచ్చే సహాయకులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు.
దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...” దివ్యాంగ శక్తి పథకంతో ఈ ఉగాది మరింత వేడుకగా జరుపుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 21 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దివ్యాంగ శక్తి పథకం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోంది. నేను, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణించటం సంతృప్తిని ఇచ్చింది. దివ్యాంగులంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వాళ్లు. గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు సహాయం చేశాం. దివ్యాంగులకు పింఛను కింద రూ.6 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. రూ.500 ఉండే దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలకు పెంచి ఇస్తున్నాం. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే వారికి రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ఏటా పింఛన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఎలాంటి ఖర్చు లేకుండా దివ్యాంగులు ఇక ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పనులకు, అవసరాలకు ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చు. నెలకు రూ.2 వేల దాకా ఆదా అయ్యే అవకాశం ఉంది. మొదటి నుంచి మేమే దివ్యాంగుల సంక్షేమానికి పని చేస్తున్నాం. భవిష్యత్తులోనూ దివ్యాంగులను ఆదుకునేలా మరిన్ని ఆలోచనలు చేస్తాం. ఎంత ఖర్చు చేస్తున్నామో చూడడం లేదు... దివ్యాంగులకు గౌరవాన్ని ఏ మేరకు పెంచుతున్నామనే అంశం పైనే దృష్టి సారించాం. కూటమి అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమే. దివ్యాంగులకు అండగా నిలబడాలనే ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. మహిళల కోసం తెచ్చిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకూ 52 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దివ్యాంగ శక్తితో లక్షల మందికి మేలు జరుగుతుంది. దివ్యాంగ సమస్యలపై ఎప్పుడూ పోరాటాలు చేసే మంద కృష్ణమాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరావులను అభినందిస్తున్నాను.”అని సీఎం అన్నారు.
పేదల కోసం పని చేసే ప్రజా ప్రభుత్వమిది
“దివ్యాంగులకు ఇంకా మేలు చేకూరుస్తాం... దానికి కొంచం సమయం పడుతుంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత దివ్యాంగుల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. రూ.500గా ఉన్న పింఛను 2014లో టీడీపీ వచ్చాక రూ.1500 చేశాం. 2018-19 మధ్య రూ.3000కు పెంచాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ పెన్షన్ను రూ.6000 చేశాం. దివ్యాంగులను ఆదుకునే అవకాశాన్ని భగవంతుడు అందించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేశాం. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి.. పేదలను ఆదుకోవాలని ఆ ఎన్నికల్లో కలిశాం. 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి అభ్యర్థులు గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకుండా ఉంటే దివ్యాంగుల పింఛన్లు పెరిగేవి కాదు. దివ్యాంగ శక్తి పథకం వచ్చేది కాదు. స్కూటర్లు ఇచ్చినా ట్రై సైకిళ్లు అందించినా దివ్యాంగులను మిగతా వారికంటే ఎక్కువ ఆదరించాలి. దివ్యాంగులకు ల్యాప్ టాప్‌లు అందించాం. వారికి మరింత మంచి చేస్తాం... మంచి చేసిన వారిని గుర్తుంచుకోవాలి. జరిగిన మంచిని 10 పది మందికి చెప్పాలి. సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతినెలా పేదల సేవలో కార్యక్రమం ద్వారా తెల్లవారు ఝామునే పింఛను ఇస్తున్నాం. అప్పులు చేసినా, కేంద్రం నుంచి నిధులు తెచ్చినా పేదల సంక్షేమం కోసమే. పట్టుదలకు దివ్యాంగులు మారుపేరు. కఠోర శ్రమతో సాధించే వరకు నిద్రపోరు. దివ్యాంగులకు క్రీడలు కూడా నిర్వహించాం...రాష్ట్రంలో ముందుకు వచ్చిన దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వెళ్లేలా చేస్తాం. గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. దివ్యాంగుల పేరుతో బాగున్న వారు కూడా పింఛన్లు, ఉద్యోగాలు పొందారు. ఇది చాలా నీచం బాధాకరం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
*కూటమి కలకాలం ఉండాలి: దివ్యాంగులు
సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆత్మీయ విందుకు హాజరైన పలువురు దివ్యాంగులు తమ అభిప్రాయాలను... తమ భావాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఇలాగే కలిసి ఉండాలని... ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నారు. మంచి ప్రభుత్వం కొనసాగితే... తమకు సంక్షేమ పథకాలు ఇలాగే అందుతూ ఉంటాయని చెప్పారు. దివ్యాంగులుగా పుట్టినందుకు బాధగా ఉన్నా...ప్రభుత్వం తమను చూసుకుంటున్న విధానంతో సంతోషంగా ఉందన్నారు. తమను క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నారని...గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని పలువురు దివ్యాంగులు అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల ముసుగులో కొందరు పింఛన్లు పొందుతున్నారని... పింఛన్ల వెరిఫికేషన్ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నారు కూడా దివ్యాంగులమని తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకుని ప్రభుత్వ కోటాలో ఉద్యోగాలు పొందుతున్నారని... అలాంటి వారిని గుర్తించేలా వెరిఫికేషన్ చేయాలని సీఎంకు కొందరు దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు.

