అచ్చమ్మ అగ్రహారంలో పాఠశాల పర్యటన: ఎమ్మెల్యే పులివర్తి నాని
అచ్చమ్మ అగ్రహారంలో పాఠశాల పర్యటన: ఎమ్మెల్యే పులివర్తి నాని
- ప్రభుత్వ పాఠశాల వసతులపై సమీక్ష
- విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే
- విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి
తిరుపతి జిల్లా, ఏప్రిల్ 1 (పీపుల్స్ మోటివేషన్): పాకాల మండలం అచ్చమ్మ అగ్రహారం పంచాయతీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు.
పాఠశాల ఆవరణలో ఉన్న వినాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలోని వసతులు, పరికరాలపై సమగ్రంగా ఆరా తీశారు. ఇంకా అవసరమైన సౌకర్యాల గురించి హెడ్ మాస్టర్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతి రోజూ అందిస్తున్న మెనూ, ఆహార నాణ్యతపై వివరాలు సేకరించారు.
విద్యార్థులను నేరుగా ప్రశ్నించి ఉపాధ్యాయుల బోధన విధానం, పాఠశాల వాతావరణంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు.
