పదో తరగతి పరీక్షలవ్వకుండా ఇంటర్ ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు
పదో తరగతి పరీక్షలవ్వకుండా ఇంటర్ ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు
అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలి
వసూలు చేసిన ఫీజును ఆయా కళాశాలలు వెంటనే తిరిగి ఇచ్చేయాలి
-ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి సౌరభ్ గౌర్
అమరావతి/విజయవాడ, (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తి కాకుండానే 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపట్టిన ప్రైవేటు జూనియర్ కళాశాలలపై కఠిన చర్య లు తీసుకుంటామని ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి సౌరభ్ గౌర్ హెచ్చరించారు. కొన్ని జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ ప్రస్తుతం పదో తగరతి చదువుతున్న విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీని వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తుందని, దాని ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ప్రవేశాలు కల్పించి, వసూలు చేసిన ఫీజును ఆయ కళాశాలలు వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. ఏదైనా జూనియర్ కళాశాల అడ్మిషన్ నోటిఫికేషన్ కు ముందే ప్రవేశాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందితే ఆ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయడం తో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సౌరభ్ గౌర్ హెచ్చరించారు.