AP CM CHANDRA BABU: తొలి 5 సంతకాలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
AP CM CHANDRA BABU: తొలి 5 సంతకాలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై తొలి రోజు సంతకాలు
లబ్దిదారులు, సాధారణ ప్రజల సమక్షంలో ఫైళ్లపై సంతకాలు
16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం
పెన్షన్లు రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం
యువత నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపైనా సంతకాలు చేసిన సీఎం
ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు చేపట్టారు.
వేదపండితులు పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తరువాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు ఘనమైన స్వాగతం పలికారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చి రహదారులను పూలమయం చేశారు. అలాగే సచివాలయంలో ఉద్యోగులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మెగా డీఎస్సీపై తొలి సంతకం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. మొదటి హామీ అయిన మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్రబాబు నిరుద్యోగుల సమక్షంలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఇక ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై రద్దు చేస్తామని ఇచ్చిన హామీ రెండో హామీపై రైతుల సమక్షంలోనే సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపైనా లబ్ధిదారులు సమక్షంలో మూడో సంతకం చేశారు. నైపుణ్య గణన దస్త్రంపై నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని చేశారు.ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.....‘‘గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని ఎన్నికల ప్రచార సమయంలో యువత తమ ఆవేదనను నా దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు. దేశంలోనే ఎక్కువగా మన రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం రేటు ఉంది. దీంతో నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యోగాలు కల్పించాలని నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించాం. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ మేరకే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేశాను’’ అని అన్నారు.
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం
‘‘గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. దీనిలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ఈ చట్టంతో ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. భూమిని కొందరు కొన్నారు. కొందరికి వారసత్వంగా వచ్చింది. కానీ ఆ పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? దానం చేసినట్లు జగనన్న భూహక్కు అని రాసుకున్నారు. చట్టాన్ని తెచ్చి ఆయన మనుషులను పెట్టుకుంటామన్నారు. సొంత మనుషులతో రికార్డులు మార్చడానికి ప్రయత్నించారు. రికార్డులు మార్చి సెటిల్ మెంట్లు కూడా చేసుకున్నారు. ఒకసారి రికార్డులు మార్చితే హైకోర్టుకు వెళ్లాలి. హైకోర్టుకు వెళితే ఏళ్లు పడుతుంది. అందుకే దీన్ని రద్దు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పెన్షన్ల పెంపుపై 3వ సంతకం
పెన్షన్ల పెంపు ఫైల్‌పై సంతకంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మొదటి సారి రూ.35 లతో ఎన్టీఆర్ పెన్షన్లు ప్రారంభించారు. సమైక్యరాష్ట్రంలో నేను దాన్ని రూ.75లకు పెంచాను. విభజన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్లను రూ.1000లకు, తర్వాత రూ.2 వేలకు పెంచాను. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం విడతల వారీగా పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.4 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్‌తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు నెలకు రూ. 1000 చొప్పున కలిపి ఇస్తానని చెప్పాను. పెంచిన వాటితో కలిపి జులైలో రూ.7 వేలు పెన్షన్ లబ్ధిదారులకు అందుతుంది. దివ్యాంగుల పెన్షన్ కూడా రూ.6 వేలకు పెంచాం... పెంచిన పెన్షన్ మూడు నెలలకు వర్తిస్తున్నందున జూలైలో దివ్యాంగులు రూ.12 వేలు తీసుకుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ పెంచాము. ఇబ్బందులు పడేవారిని గుర్తించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
నైపుణ్య గణనపై 4వ సంతకం
‘‘యువత నైపుణ్యం లెక్కించేందుకు, దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కానీ వాటిని సాధించుకోవాలంటే నాలెడ్జ్, నైపుణ్యం కావాలి. ఉన్నత చదువులు చదివినా సరైన స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదు. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు వెళ్తున్న సమయంలో తగిన స్కిల్స్ ఉంటే ప్రపంచంలో రాణించవచ్చు. ప్రపంచంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేశారు. కులాల వారీగా లెక్కలు తీశారు. కానీ మొదటి సారిగా స్కిల్ గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరికి ఎలాంటి నైపుణ్యం ఉంది. దేశంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి. దానికి తగ్గ స్కిల్స్ ఉన్నాయా లేవా అన్నది లెక్కిస్తున్నాం. పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు రాకుండా మన రాష్ట్రం నుంచే కావాల్సిన మానవ వనరులు అభివృద్ధి చేయాలి. కావాల్సిన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అన్న క్యాంటీన్ ల పునరుద్దరణపై 5వ సంతకం
‘‘పేదవాళ్లకు అన్నం పెట్టాలన్న ఉద్దేశ్యంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్‌లను తీసుకొచ్చింది. రూ.5 లకే అల్పాహారం, రూ.5 మధ్యాహ్న భోజనం, రూ5 లకే రాత్రి భోజనం అందించాం. చిరు ఉద్యోగులకు, కూలీ పనులకు వెళ్లే వాళ్లకు ఎంతో ఉపయోగపడింది. కర్ణాటకలో ఇందిరా గాంధీ, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ పేరుతో క్యాంటీన్‌లు పెట్టారు. మనం ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసేసింది. చాలా మంది అన్నా క్యాంటీన్‌లలో భోజనాలకు విరాళాలు కూడా ఇచ్చారు. కానీ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రద్దు చేసి పైశాచిక ఆనందం పొందారు. అందుకే ఐదవ సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చేశాను. ఎన్ని క్యాంటీన్లు పెట్టాలి అనేది పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 5 సంతకాల ద్వారా లబ్ది పొందే వర్గాల సమక్షంలో సీఎం ఆయా ఫైళ్లపై సంతకాలు పెట్టారు. ఇక ప్రజల పాలన ఉంటుందని చంద్రబాబు అన్నారు.