వెయిటింగ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? టికెట్లు కన్ఫామ్ చేసుకోవడం ఎలా.?
వెయిటింగ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? టికెట్లు కన్ఫామ్ చేసుకోవడం ఎలా.?
ట్రైన్ టికెట్ (Train ticket) బుక్ చేసుకునేటప్పుడు అన్నిసార్లూ కన్ఫామ్ టికెట్ రావాలనే లేదు. కొన్నిసార్లు సీట్లన్నీ పూర్తయిపోయాక వెయిటింగ్ లిస్ట్ టికెట్లను రైల్వే శాఖ జారీ చేస్తుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు GNWL30/WL8 వంటి నంబర్తోతో టికెట్ జారీ అవుతుంది. ఇలాంటి సందర్భంలో కొందరికి ఇందులో వెయిటింగ్ లిస్ట్ నంబర్ ఏదో కనుక్కోవడంలో తికమక పడుతుంటారు. ఇంతకీ వీటి మధ్య తేడా ఏంటి?
GNWL.. అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే వెయిటింగ్ లిస్ట్ జాబితాలో ఎంత మందికి టికెట్లు జారీ చేసిందీ ఈ నంబర్ చెబుతుంది. మనం కూడా వెయిటింగ్ లిస్ట్ టికెట్ కొనుగోలు చేస్తే.. ఆ జాబితాలో సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో మనతో పాటు టికెట్ బుక్ చేసుకున్న వారు తన టికెట్ను రద్దు చేసుకుంటే.. వాస్తవంగా వెయిటింగ్ లిస్ట్ స్థితి మారుతుంది. ఉదాహరణకు GNWL30/WL8 అంటే..మొత్తం 30 మంది వెయిటింగ్ లిస్ట్ జాబితాలో టికెట్లు బుక్ చేస్తే అందులో 22 మంది తమ టికెట్లను రద్దు చేసుకున్నారని అర్థం. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది 8 మాత్రమే. కాబట్టి ఈసారి టికెట్ బుక్ చేసినప్పుడు ఈ తేడాను గమనించండి.
తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తే దాన్ని TQWLగా సూచిస్తారు. తత్కాల్లో బుక్ చేసినప్పుడు టికెట్లు అయిపోతే ఈ కోటాలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేస్తారు. సాధారణంగా ఛార్ట్ రూపొందించే సమయంలో తొలుత జనరల్ వెయిటింగ్ లిస్ట్క ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి తత్కాల్లో ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ వస్తే టికెట్ కన్ఫామ్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆన్లైన్లో బుక్ చేసుకుని టికెట్ కన్ఫామ్ కాకపోతే.. రైలు ప్రయాణానికి అనుమతించరు. ఛార్ట్ ప్రిపేర్ చేసే సమయంలో ఆటోమేటిక్ గా టికెట్ క్యాన్సిల్ చేస్తారు.
ఇవి కాకుండా పూల్డ్ కోటా (POWL), రిమోట్ లొకేషన్ కోటా (RQWL) కూడా ఉంటాయి. రైలు బయల్దేరే, చేరుకునే స్టేషన్లు కాకుండా మధ్యలో ఉండే నగరాలు, పట్టణాలు రిమోట్ కోటా కిందకు వస్తాయి. తక్కువ దూర ప్రయాణానికి పూల్డ్ కోటా టికెట్లు కేటాయిస్తారు. ఒక రైలుకు ఒక పూల్డ్ కోటా మాత్రమే ఉంటుంది. వీటికి వేరే ఛార్ట్ ఉంటుంది. పైగా ఈ తరహా కోటా టికెట్లు కన్ఫామ్ అవ్వడం చాలా అరుదు.