మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం
- ప్రజల మనసుల్లో నిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుంది..
- పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
- ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం..
- రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..
- ఉరవకొండ పట్టణంలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, తదితరులు..
అనంతపురం, జులై 01 (పీపుల్స్ మోటివేషన్):
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని, పండగలాంటి వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
సోమవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ పట్టణంలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఇంతకుముందెన్నడు లేనివిధంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ వాడవాడలా సమాజ హితం కోరే నాయకులు, అధికార యంత్రాంగం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారన్నారు. ఇంతకుముందు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచడం, మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటికి జరిగిన నష్టం కన్నా గత ఐదేళ్లలో జరిగిన నష్టం చాలా ఎక్కువన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆర్థిక రంగం ఏ పరిస్థితుల్లో ఉందేనే అంచనా వేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని అందరినీ పిలిచి జూలై 1వ తేదీనే తమ ప్రభుత్వం చేపట్టే మొట్టమొదటి సంక్షేమ పథకం ఉదయం 6 గంటలకు పంపిణీ జరగాలంటే జూన్ 29వ తేదీనే పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సిన 4,400 కోట్ల రూపాయలకుపైన మీరు ఏర్పాటు చేయాలని తెలియజేశారన్నారు. 29వ తేదీన ఉదయాన్నే బ్యాంకులకు వెళ్లాలని, మధ్యాహ్నానికి బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా కావాలని, అక్కడి నుంచి 30వ తేదీన మండల, వార్డుల వారీగా డబ్బులు పంపిణీ చేయాలని, ఒకటో తేదీన ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలని, 1వ తేదీ సాయంత్రంలోపు నూటికి నూరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూన్ 29న బ్యాంకులకు జమ చేయడం, అదే రోజు డ్రా చేయడం, 30వ తేదీన వార్డులకు, సచివాలయాలకు పంపిణీ చేయడం, సోమవారం ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మా ప్రభుత్వం మాటలు ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, ప్రజల మనసుల్లో చిరకాలం నిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయికి రావడం జరిగిందని, జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఇక్కడికి రావడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా అధికార యంత్రాంగం మొత్తం తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతోందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 3 బకాయిలతో ఇవ్వడం జరుగుతోందని, జిల్లాలో 2,89,508 మంది లబ్ధిదారులకు 197.44 కోట్ల రూపాయల పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల తర్వాత మనదే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న జిల్లా అన్నారు. బ్యాంకులో నుంచి నగదు విత్ డ్రా శనివారం రోజే చేయడం జరిగిందని, పెన్షన్ల పంపిణీ కోసం మండల, గ్రామస్థాయి అధికారులను నియమించి ప్రతి 50 ఇళ్లకు క్లస్టర్ గా మ్యాపింగ్ చేసి వార్డు, గ్రామసభలు నిర్వహించి పింఛన్ల పంపిణీ చేపడుతున్నామన్నారు. జిల్లాలో సజావుగా పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతోందని, ఈ రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, తహసీల్దార్ దస్తగిరయ్య, ఎంపిడిఓ సుబ్బరాజు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.