Wedding: మన దేశంలో చదువు కంటే పెళ్లి పైనే ఖర్చెక్కువ..!
Wedding: మన దేశంలో చదువు కంటే పెళ్లి పైనే ఖర్చెక్కువ..!
సగటు భారతీయులు చదువుతో పోలిస్తే వివాహంపైనే రెండింతలు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ వెల్లడించింది. భారత వివాహ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది. ఆహారం, నిత్యావసరాల తర్వాత స్థానం దీనిదేనని వెల్లడించింది.
భారత్లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లవుతున్నాయని నివేదిక అంచనా వేసింది. చైనాలో 70- 80 లక్షలు, అమెరికాలో 20- 25 లక్షలుగా ఉంటుందని తెలిపింది. అమెరికాతో పోలిస్తే భారత వివాహ పరిశ్రమ పరిమాణం రెండింతలు ఉంటుందని అంచనా వేసింది.ఒకవేళ వివాహాలను ప్రత్యేక రిటైల్ కేటగిరీగా వర్గీకరిస్తే.. ఆహారం, నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద విభాగంగా ఇదే ఉంటుందని పేర్కొంది.
భారత్లో వివాహాలు ఎంత ఆడంబరంగా చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. దుస్తులు, ఆభరణాల వంటి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. పరోక్షంగా వాహన, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ గిరాకీ పుంజుకుంటుంది. పెళ్లిని ప్రతిష్టాత్మకంగా భావించే భారతీయులు తాహతుకు మించి ఖర్చు చేస్తారని నివేదిక వెల్లడించింది. భారత్లో సగటున ఒక పెళ్లిపై కనీసం రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. స్తోమతను బట్టి ఇది అంతకంతకూ పెరుగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో ఒక్కో పెళ్లిపై చదువు కంటే రెండింతలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. అదే అమెరికాలో విద్యపై చేసే వ్యయంతో పోలిస్తే వివాహంపై చేసే ఖర్చు సగమేనని వెల్లడించింది.
అంతర్జాతీయ స్థాయి ఖరీదైన ప్రదేశాలు వేదికగా, అతిథులకు మర్యాదలు, పసందైన వంటకాలతో భారత వివాహాలు ఆడంబరంగా జరుగుతాయని జెఫరీస్ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో దుస్తులు, ఆభరణాలు, ఆతిథ్యం, క్యాటరింగ్, రవాణా వంటి రంగాల కార్యకలాపాలు పుంజుకుంటాయని పేర్కొంది. దేశంలో ఏటా నమోదయ్యే మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్లిళ్ల కోసమే జరుగుతాయని తెలిపింది. దుస్తుల అమ్మకాల్లో 10 శాతం వివాహాల గురించేనని పేర్కొంది. పెళ్లికి 6-12 నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయని, గరిష్ఠంగా 50 వేల మంది వరకు అతిథులు హాజరవుతుంటారని తెలిపింది.