ఎటిఎం నగదుతో పరారైన ఉద్యోగి.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
ఎటిఎం నగదుతో పరారైన ఉద్యోగి.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
రాజమండ్రి, జూలై 27 (పీపుల్స్ మోటివేషన్):-
సంచలనం సృష్టించిన రెండున్నర కోట్ల నగదు దోపిడీ కేసు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ... HDFCకి సంబంధించిన హిటాచీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అశోక్ కుమార్, రాజబాబు లు ప్రతీరోజు ఏటీఎంలలో నగదు నింపుతారని తెలిపారు. మధ్యాహ్నం సమయంలో అశోక్ కుమార్ రూ.2.20 కోట్ల నగదుతో పరారయ్యాడన్నారు. ఐదు పోలీస్ బృందాలతో గాలించామని... కొత్తపేటలో షిప్ట్ కారును వదిలి సెల్ ఫోన్ విడిచిపెట్టి పరారైనట్లు గుర్తించామన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. 50 వేలు కారు అద్దెకు ఇచ్చారన్నారు. రూ.2.20 కోట్లు నిందితుడు నుంచి రికవరీ చేశామన్నారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా రికవరీ చేశామని తెలిపారు. నిందితుడిని 12 గంటల లోపే పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు నాలుగేళ్ల నుంచి హిటాచీ సంస్థలో పని చేస్తున్నాడని.. విలాసవంతానికి అలవాటుపడి రెండు వారాలుగా దోపిడీకి పధకం చేసుకున్నాడన్నారు. ప్రతీరోజూ ఏటీఎంలలో నగదు పిల్ చేయటం వల్ల ఎక్కువ డబ్బుతో వ్యాపారం చేయాలనే కోరికతో ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని మండపేట సమీపంలో పట్టుకున్నట్లు చెప్పారు. బ్యాంక్లు ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారని.. బ్యాంక్లను కూడా జీపీఎస్ తో అనుసంధానం చేస్తామన్నారు. సీసీ కెమెరాలు కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో పోలీస్ ప్రజలకు మరింత దగ్గరవుతుందని... రాత్రిపూట రోడ్లుపై తిరిగే నేరస్తులను కట్టడి చేస్తామని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. పోలీసుల క్విక్ రియాక్షన్ పై అభినందనలు వెల్లువెత్తున్నాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ HDFCలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట HDFC బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు. HDFC బ్యాంకుకు చెందిన 19 ఏటీఎంలలో రెండున్నర కోట్ల రూపాయలు ఫిల్లింగ్ చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలోనే తోటి సిబ్బంది కళ్లుగప్పి నిందితుడు నగదుతో ఉడాయించాడు. విషయం తెలిసిన బ్యాంకు అధికారులు నిందితుడిపై రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టి 12 గంటలలోపే నిందితుడు అశోక్ ను అరెస్ట్ చేశారు.