నిరంకుశ పాలనతో రాష్ట్రాలు కుదేలు
నిరంకుశ పాలనతో రాష్ట్రాలు కుదేలు
ప్రజాగ్రహంలో కొట్టుకుపోయిన నేతలు ఆత్మవిమర్శతో పాలన చేస్తేనే అభివృద్ధి
న్యూఢిల్లీ, జూలై 27 (పీపుల్స్ మోటివేషన్):-
అధికారం శాశ్వతమని ఏ రాజకీయ పార్టీ అయినా అనుకుంటే పొరపాటు, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించకుంటే మట్టికరిచి పోతాయని గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ఇటీవలి ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరిగింది. నిరంకుశంగా పాలించి, అప్పులను మిగిల్చిన నేతల్లో పాశ్చాత్తాపం కానరావడం లేదు. వీరి పాలన దేశానికి ఓ హెచ్చరిక కావాలి. ప్రజలు క్షేత్రంగా వేసుకుని పాలన చేయాలి. ప్రజాగ్రహంలో ఎన్టీఆర్ లాంటి వారు కూడా కొట్టుకు పోయారు. ఎపిలో జగన్ ప్రభుత్వం విపక్షాలను అణచివేయడం, కేసులు పెట్టడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. తాను పుట్టి పెరిగిన పార్టీలను అణగదొక్కడంలో కెసిఆర్ ఎలాంటి వెనకడుగు వేయలేదని రాష్ట్ర రాజకీయాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణలో ఉనికి లేకుండా పోవాలని కెసిఆర్ వేసిన ఎత్తుగడలు ఫలింలేదు. ఇప్పుడు ఆయనకే ఉనికిలేకుండా పోయింది. ఇక తెలంగాణలో తొలుత తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్, ఇప్పుడు ఇంతటి విపత్కర ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించి ఉండక పోవచ్చు. విపక్షాలు పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓ రకంగా అది కెసిఆర్ వైఫల్యంగానే చూడాలి. ప్రజల్లో నిరసనలు నివురుగప్పితే నాయకుడనేవాడు ఏ పార్టీలో అయినా పుట్టుకుని వస్తారని గమనించాలి. ఈ కారణంగా కేసీఆర్ కు ప్రత్యామ్నాయం కావాలనుకున్న వారికి కాంగ్రెస్ పార్టీ కనిపించింది. రేవంత్ రెడ్డిని ప్రత్యమ్నాయ నేతగా చూసి ఎన్నుకున్నారు. అయినా కెసిఆర్ ఆయన కుటుంబ పార్టీలో మార్పు కానరావడం లేదు. ఏపిలో కూడా ఆరాచక పాలన సాగించిన జగన్ ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ఆరాచకం చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. ప్రజలు ఓటుతో పక్కకు తప్పించడంతో కళ్లు బైర్లు కమ్మాయి. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు జగన్ కలవరిస్తున్నారు. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్లపాటు రాజ్యమేలారు. తమకు తిరుగు లేదన్న ధోరణిలో వారు ప్రజల ఆశలను, ఆకాంక్షలను పట్టించు కోలేదు. తమ నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యం, అభివృద్ధి ముసుగేసారు. కానీ అక్కడా మమతా బెనర్జీ లాంటి వారు పుట్టుకుని వచ్చారు. కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పెకిలించారు. అయితే ఆమె కూడా అదే ధోరణిలో నిరంకుశ పాలన సాగించడంతో ఇప్పుడు మమతా బెనర్జీ పునాదులు కూడా కదులు తున్నాయి. కర్నాటకలో బిజెపి పాలనను ఈసడించుకున్న ప్రజలు అక్కడ కాంగ్రెస్కు పట్టం కట్టారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీకి ప్రజలు గట్టి దెబ్బనే కొట్టారు. గతంలో 320 సీట్ల వరకు సంపాదించిన బిజెపి 240 సీట్లకు పరిమితం అయ్యింది. ఎన్డీఎ మిత్రపక్షాల ఊతకర్రతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అప్పుల కుప్ప చేసి పథకాలను ప్రకటించి ప్రజలను ఓట్ల రూపంలో మలచుకోవడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరారు. దీంతో రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ అప్పులు ఇప్పుడు తీర్చే శక్తి కూడా రాష్ట్రాలకు లేకుండా పోతున్నది. అందుకే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. కెసిఆర్ లేదా జగన్ తన ఇష్టం వచ్చినట్లుగా ముందుకు సాగుతూ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా, కేవలం తన సొంత నిర్ణయాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేసి దివాలా తీయించారు. వరదలు వస్తే గట్టిగా వారి పక్షాన నిలబడి అడ్డుకునే ప్రయత్నాలు సాగడం లేదు. అన్నింటికీ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మంచిది కాదు. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో ఇద్దరు నేతలు. విఫలమవుతున్నారు. బిఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా. అంతా తామే అన్నట్టుగా కెసిఆర్, కెటీఆర్ వ్యవహారాలు నడిపారు. ప్రగతిభవన్ ఛాయలకు ఎవరు రాకుండా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలకు కూడా పర్మిషన్ ఉండాల్సిందే. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉందన్న ఆరోపణల వల్ల నిర్లక్ష్యం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మీడియాను దూరం పెట్టారు. కేసీఆర్, జగన్ చిన్నపాటి విమర్శలను కూడా స్వీకరించలేని స్థితికి చేరుకున్నారు. ఫలితంగా ప్రజల మనోభావాలను తెలియజేయడానికి పార్టీలో కూడా ఎవరూ సాహసించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఇది గమనించి వారినే దూరం పెట్టారు. ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలను ఎవరు అవలంబించినా పతనం తప్పదని రుజువు చేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఉచిత హామీలను పక్కన పెట్టి పాలన సాగించాలి.