Red Ants: ఎర్ర చీమలతో చట్నీ.. సోషల్ మీడియాలో వైరల్..!
Red Ants: ఎర్ర చీమలతో చట్నీ.. సోషల్ మీడియాలో వైరల్..!
- నెటిజన్లతో పంచుకున్న ఓ వ్లాగర్.. ఏకంగా 25 మిలియన్లకుపైగా వ్యూస్ లభ్యం..
- ఒడిశాలోని ఓ గిరిజన ప్రాంతంలో వీడియో చిత్రీకరణ..
- రుచిని ఆస్వాదించిన వ్లాగర్.. ఈ చట్నీకి జ్వరం తగ్గించే గుణం ఉందని స్థానికులు చెప్పినట్లు వెల్లడి...
సాధారణంగా మనం ఎర్ర చీమలను చూస్తేనే బెంబేలెత్తుతాం.. అవి కుడితే విపరీతమైన మంట పుడుతుందని వాటి జోలికి వెళ్లం..
ఇంటి ముందు ఎర్ర చీమలు కనిపించినా వాటిని తొక్కకుండా జాగ్రత్తగా దాటుతాం. కానీ ఒడిశా, ఛత్తీస్ గఢ్, పరిసర అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసీలకు మాత్రం ఎర్రచీమలంటే భయం లేదు సరికదా వాటిని చూస్తే నోరూరుతుంది! ఎర్ర చీమలు ఎక్కడున్నాయో వెతికి పట్టుకొని మరీ చట్నీ చేసుకొని లొట్టలేసుకుంటూ తినేస్తారు! అందుకే ఈ వెరైటీ వంటకం తయారీ వీడియో ప్రస్తుత నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 25 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి దుమ్ము రేపుతోంది.
ఫుడ్ గయ్ రిషీ పేరుతో ఓ ఇన్ స్టాగ్రామ్ వ్లాగర్ తాజాగా ఒడిశాలో ఓ గిరిజన కుటంబం ఎర్ర చీమలను పట్టుకొని చట్నీ తయారు చేసే వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ చట్నీ గురించి నెటజన్లందరికీ అర్థమయ్యేలా తయారీ విధానం గురించి వీడియోలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో వివరించాడు.
ఆ వీడియోలో ముందుగా ఓ మహిళ చెట్టుపై ఉన్న ఎర్ర చీమల గూడును పొడవాటి కర్ర సాయంతో తెంపి నేలపై పరిచిన బట్టపై పడేసింది. ఆ గూడులో తెల్లటి చీమ గుడ్లు కూడా ఉన్నాయి. ఆ వెంటనే దాన్ని ఓ డబ్బాలో వేసింది. అనంతరం వాటిని ఓ పళ్లెంలో వేసి అందులోంచి చెత్తా చెదారాన్ని తొలగించింది. చివరగా రోట్లో కాసిని ఎండుమిర్చి, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డలు వేసి దంచి ఆ మిశ్రమంలో ఎర్ర చీమలు, కాస్త నీరు కలిపి మళ్లీ దంచింది. అంతే.. రుచికరమైన ఎర్ర చీమల చట్నీ రెడీ అయిపోయింది!
ఆ చట్నీని రుచి చూసిన వ్లాగర్ కూడా ఆహా అన్నాడు. ఆ గిరిజన కుటుంబంలోని వారంతా ఉత్త చట్నీనే లొట్టలేసుకుంటూ ఆరగించారు. ఎర్ర చీమల చట్నీ జ్వరాన్ని కూడా తగ్గిస్తుందని స్థానికులు చెప్పారని వీడియోలో వ్లాగర్ పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. కొందరేమో చీమలను చంపి తినడం పాపమని విమర్శిస్తుంటే మరికొందరేమో మనవాళ్లు చైనా నుంచి ఈ డిష్ ను కాపీ కొట్టారా? అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఒడిశాలో ప్రజాదరణ పొందిన ఎర్ర చీమల చట్నీకి ఈ ఏడాది జనవరి 2న ప్రతిష్టాత్మక జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే జీఐ ట్యాగ్ లభించింది. వైరల్ వీడియోలో తయారైన చట్నీని జీఐ ట్యాగ్ పొందిన చట్నీ పోలి ఉంది. ఈ చట్నీని ఒడిశావాసులు స్థానికంగా కాయ్ చట్నీ అని పిలుస్తారు.