YouTuber Nischa Shah: ఆమె చేసిన వీడియోలు 98.. ఏడాదికి ఆదాయం రూ. 8 కోట్లు ఆమె చేసిన వీడియోలు ఏంటి.?
YouTuber Nischa Shah: ఆమె చేసిన వీడియోలు 98.. ఏడాదికి ఆదాయం రూ. 8 కోట్లు ఆమె చేసిన వీడియోలు ఏంటి.?
- ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనతో ఉద్యోగానికి స్వస్తి
- సీఎన్ బీసీ వార్తాసంస్థకు తన ప్రస్థానాన్ని తెలియజేసిన మాజీ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ నిశ్చా షా
- గతంలో లండన్ లో దాదాపు పదేళ్లపాటు పనిచేసినట్లు వెల్లడి
- సొంత అభిరుచితో ముందుకు సాగాలని యూట్యూబ్ చానల్ కు శ్రీకారం
- ప్రస్తుతం ఆమెకు 1.16 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు
- పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో వీడియోలు.. రూ. కోట్లలో సంపాదన
ఒక్కసారిగా తన కెరీర్ ను మార్చుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఆమె ఇటీవల సీఎన్ బీసీ వార్తా చానల్ తో మాట్లాడుతూ పంచుకుంది. ఆమె ఒకప్పుడు ఓ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్... కార్పొరేట్ ప్రపంచంలో కొలువు.. ఏటా ఆరు అంకెల జీతం.. ఆ రంగంలో దాదాపు పదేళ్ల అనుభవం.. మరింతగా పైకి ఎదిగే అవకాశం... కానీ వాటన్నింటినీ వదులుకొని రిస్క్ తీసుకోవాలని ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిత్యం ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగ జీవితానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఏకంగా యూట్యూబర్ అవతారం ఎత్తింది. కెమెరా పట్టుకొని సొంతంగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అంతే.. ఏడాది తిరిగేసరికి ఉద్యోగ జీవితంలో సంపాదించిన డబ్బుకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఆర్జిస్తోంది. ఆమె పేరే నిశ్చా షా..
2022 నాటికి బ్యాంకింగ్ రంగంలో చేరి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న తనకు చేస్తున్న పనిపై ఆసక్తి పోయిందని నిశ్చా షా చెప్పుకొచ్చింది. అప్పటికి లండన్ లోని క్రెడిట్ అగ్రికోల్ అనే సంస్థలో పనిచేస్తూ ఏటా సుమారు రూ. 2 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలిపింది. కానీ జీవితం ఏదో వెలితిగా అనిపించిందని.. చేస్తున్న ఉద్యోగంలో సవాళ్లేమీ లేకపోవడం, తెలివితేటలను పెంచేదిగా లేకపోవడంతో ఏదైనా అర్థవంతమైన పని చేయాలని అనుకున్నట్లు నిశ్చా షా వివరించింది.
‘ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించా. కానీ అప్పటివరకు నేను చేసిన పని కేవలం కార్పొరేషన్లు, ప్రభుత్వాలకు మాత్రమే ఉపయోగపడింది’ అని నిశ్చా షా తెలిపింది. అందుకే 2023 జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్ లో పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన కంటెంట్ క్రియేటర్ గా మారినట్లు చెప్పింది.
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు, ఉత్పత్తులు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యాల ద్వారా బాగా ఆర్జించింది. ఆమె తీసుకున్న రిస్క్ ఫలించింది. 2023 మే నుంచి 2024 మే మధ్య ఆమె యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా రూ. 8 కోట్లకుపైగా సంపాదించింది.
గతంలో నేను పొందిన దానికన్నా ఎక్కువగా పొందేందుకు నా అభిరుచే దోహదపడుతోంది’ అని నిశ్చా షా చెప్పింది.‘డబ్బు వెనకాల పరుగులు పెట్టడం మానేశా. అందుకు బదులుగా నా అభిరుచి వెంట పరిగెడుతున్నా. ఇందులోనే ఆనందం వెతుక్కుంటున్నా.
అయితే తన యూట్యూబ్ చానల్ హిట్ కావడం అంత ఆషామాషీగా ఏమీ జరగలేదని షా పేర్కొంది. మొదటి వెయ్యి మంది సబ్ స్క్రైబర్లను సాధించేందుకు 11 నెలల సమయం పట్టిందని చెప్పింది. గతంలో అత్యవసర నిధి కింద కొంత డబ్బు దాచుకున్నానని.. దీనివల్ల తన అభిరుచిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టేందుకు వీలైందని ఆమె వివరించింది. 2022 సెప్టెంబర్ లో తాను చేసిన ఒక వీడియో వల్ల ఏకంగా 50 వేల మంది సబ్ స్క్రైబర్లు ఒక్కసారిగా పెరగడంతో రూ. 3 లక్షలకుపైగా ఆర్జించినట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసే వీడియోలకు కనిష్ఠంగా లక్ష వ్యూస్ నుంచి గరిష్ఠంగా 90 లక్షల వ్యూస్ లభిస్తున్నాయి.
ప్రస్తుతం ఆమె యూట్యూబ్ చానల్ ‘నిశ్చా’కు ఏకంగా 1.16 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన 98 వీడియోల ద్వారానే అంత మంది సబ్ స్క్రైబర్లతోపాటు భారీగా డబ్బు సంపాదిస్తుండటం విశేషం.