ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి..
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి..
-ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) డా.జస్టిస్ మన్మధ రావు
• ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) డా.జస్టిస్ మన్మధ రావు పేర్కొన్నారు.
కర్నూలు, సెప్టెంబరు 29 (పీపుల్స్ మోటివేషన్):-
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) డా.జస్టిస్ మన్మధ రావు పేర్కొన్నారు.
ఆదివారం జిల్లా న్యాయస్థాన ఆవరణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో టిజివి గ్రూప్ సహకారంతో ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి డా.జస్టిస్ మన్మధ రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ బి.బిందు మాధవ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) డా.జస్టిస్ మన్మధ రావు మాట్లాడుతూ... హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. గతంలో నేను హైదరబాద్ లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న క్రమంలో వివిధ ప్రాంతాలకు ద్విచక్రవాహనం మీద ప్రయాణం చేయాల్సి వచ్చేదని అప్పుడు హెల్మెట్ వాడకం అలవాటుగా ఉండడం వల్ల ప్రమాదాల నుంచి బయట పడటం జరిగిందన్నారు. ప్రజలు వారి దినచర్యలో భాగంగా పనుల రీత్యా బయటకు రావడం జరుగుతుందని అప్పుడు పలు రోడ్డు ప్రమాదాలు ద్విచక్రవాహనల ద్వారా జరుగుతున్నాయని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం ద్విచక్రవాహన ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. అందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, టిజివి గ్రూప్ సహకారంతో 200 మంది ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా హెల్మెట్లు తీసుకున్న వారు హెల్మెట్లు ఇంట్లో ఉంచకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఇతరులలో స్ఫూర్తిని నింపాలన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి మాట్లాడుతూ.. హెల్మెట్ తీసుకున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అదే విధంగా ద్విచక్ర వాహనదారులకు అవసరమైన హెల్మెట్లు పంపిణీ చేసిన టిజివి ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హెల్మెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని అందుకు వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ఖచ్చితంగా వాడాలన్నారు. కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వాహనాన్ని నడపాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ... ద్విచక్ర వాహనం నడిపే వారు హెల్మెట్ ను ఒక ఇబ్బందిగా భావించి హెల్మెట్ ను వాడడం లేదని, కానీ హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద ప్రమాదంలో సైతం చిన్న గాయాలతో బయటపడే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా ప్రతి నెలలో ఒకసారి రహదారి భద్రతా సమావేశాలు నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజలు వారు చేరాల్సిన గమ్యస్థానాలకు సరైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు.
జిల్లా ఎస్పీ బి.బిందు మాధవ్ మాట్లాడుతూ... వాహనం నడిపే వారు హెల్మెట్ వాడకం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయాలు కాకుండా చిన్న దెబ్బలతో బయట పడే అవకాశం ఉందంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాహన యాజమాన్యాలు కూడా వాహనం అమ్మే సమయంలో హెల్మెట్ తప్పనిసరి చేయడం వల్ల ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గడం జరిగిందన్నారు. అదే విధంగా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరిస్తే వాహన ప్రమాదాలు పూర్తిగా నివారించే అవకాశం ఉంటుందన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు వాహనదారులకు హెల్మెట్ వాడకం పట్ల వాహన దారులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గత సంవత్సరంలో 3703 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 3042 రోడ్డు ప్రమాదాలలో వాహనదారులు హెల్మెట్ ఉపయోగించలేదన్నారు. అందుకు జిల్లాలోని న్యాయ సేవాధికార సంస్థ, రవాణా, పోలీసు, న్యాయవాదులు హెల్మెట్ వాడకం పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగా టిజివి గ్రూప్ సహకారంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 200 మందికి హెల్మెట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల), జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శాలువతో సత్కరించారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి (కర్నూలు, నంద్యాల) వారు పోలీసు, స్కౌట్స్ గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, టిజివి సంస్థ లీగల్ అడ్వైసర్ అడ్వైజర్ శ్రీనివాసులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.