యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు.. సీనియర్లు జూనియర్లను స్నేహపూర్వక భావంతో ఉండాలి
యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు.. సీనియర్లు జూనియర్లను స్నేహపూర్వక భావంతో ఉండాలి
-ర్యాగింగ్ నిరోధక చర్యలు పటిష్టంగా చేపట్టాం..
-మీ ఆలోచన విధానమే రేపటి సమాజానికి దిక్సూచి అంటూ ఎస్పీ పిలుపు..
-సీనియర్లు జూనియర్లను స్నేహపూర్వక భావంతో పరిచయం చేసుకుని ఆహ్వానించాలి..
-జూనియర్ల మనోభావాలను దెబ్బతీసే వికృత చేష్టలకు పాల్పడి మీ అమూల్యమైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దు..
-విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కోసం మెడికల్ కళాశాల వారు ర్యాగింగ్‌ను నిరోధించడంలో నిబద్ధతను పాటించాలి..
-నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ (1800-180-5522) పోలీసు హెల్ప్‌లైన్...112
-- జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS
అనంతపురం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్, డ్రగ్స్ నివారణ, హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS పాల్గొని, విద్యార్థులకు కొన్ని అమూల్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో చదివే అవకాశం అందరికీ రాదు. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోపరుచుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించుకునే సోపానంగా మార్చుకోవాలని అన్నారు. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరికి చక్కటి భవిష్యత్తును ఈ కళాశాలలో నాంది పలుకుతుందని, క్రమశిక్షణతో చదివి రేపటి రోజు ఎలా ఉండాలని పునాది ఇక్కడే వేసుకోవచ్చు అన్నారు. ర్యాగింగ్ అనేది మహా భూతమని, ఇది విద్యార్థుల భవిష్యత్తునే కాకుండా తల్లిదండ్రుల ఆశయాలను కూడా నాశనం చేస్తుందని, అంతేకాకుండా క్రిమినల్ చర్యలవైపు వెళ్లే విధంగా చేసి భవిష్యత్తును అంధకారంలోకి తీసుకువెళ్తుందని అన్నారు. ర్యాగింగ్ నిరోధించడంలో అందరూ కూడా బాధ్యత వహించాలి. ర్యాగింగ్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చట్టం లో ఉన్న శిక్షల గురించి తెలియజేస్తూ నోటీసు బోర్డులను కళాశాల వారు ఏర్పాటు చేయాలన్నారు. సీనియర్లు జూనియర్లను సాటి వ్యక్తిగా సోదరభావంతో ముఖ పరిచయం చేసుకుంటూ వారి ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా సహృద్భావంతో ప్రవర్తించాలని అప్పుడే మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ర్యాగింగ్ నిర్మూలన కొరకు పోస్టర్లు మరియు బ్యానర్లు ఏర్పాటుచేసి కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని ఎక్కడైనా ర్యాగింగ్ వంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే డైల్ 112/ యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-5522/ UGC పోర్టల్ ద్వారా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ర్యాగింగ్ సంబంధిత ఏ సమస్య ఉన్న వెంటనే యాజమాన్యానికి పోలీసులకు తెలియజేయాలని ర్యాగింగ్ రహిత లక్ష్యంగా మనమందరం ముందుకు వెళ్లాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. చివరగా "యాంటీ - ర్యాగింగ్ ప్లెడ్జ్" నూ విద్యార్థులు అందరి చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి & జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ తెలుగు మధుసూదన్, ఫోరెన్సిక్ హెచ్ ఓ డి ఆచార్య డాక్టర్ శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుమన గోపీచంద్, డాక్టర్ గాలేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.