మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
• ఉచిత కుట్టు మిషన్ల పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం..
• ఎవరెవరు అర్హులు..
FREE SEWING MACHINE FOR WOMEN:
మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా తొలి విడుతలో దాదాపు లక్షకు పైగా కుట్టుమిషన్లు అందించనుంది. ఎంపికైన వారందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. అంతేకాదు మున్ముందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో శిక్షణ ఇచ్చి అవకాశాలు కల్పించనుంది.
బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) వర్గాలకు చెందిన పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తే వాటి పరిశీలన, అర్హుల ఎంపిక కూడా కష్టమే! ఈ నేపథ్యంలో తొలి విడతగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 26 జిల్లాల పరిధిలోని 60 నియోజకవర్గాల్లో ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మరో 60 నియోజకవర్గాలు, మిగిలిన 55 నియోజకవర్గాలు మూడో విడతలో ఎంపిక కానున్నాయి. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా 60 నియోజకవర్గాల నుంచి బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 2 వేల నుంచి 3 వేల మంది అర్హులను ఎంపిక చేస్తారు. అంతకు మించి దరఖాస్తులను తదుపరి విడతలో పరిగణలోకి తీసుకుంటారు.
గతంలో 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా ఈ పథకాన్ని అమలు చేయగా అక్కడక్కడా లోపాలు తలెత్తాయి. అందుకే ఈ సారి మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాల చొప్పున ఒక్కో కేంద్రంలో 30 నుంచి 50 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. హాజరు నమోదుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి 70 శాతం హాజరున్న వారికే ఉచితంగా కుట్టుమిషన్ అందించనున్నారు.
- ప్రతి మహిళపై రూ.21వేలు ఖర్చు
- ఈ నెలాఖరు లేదా ఏప్రిల్లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి
- టైలరింగ్ శిక్షణ కోర్సు వ్యవధి 360 గంటలు కాగా 45, 60, 90 రోజుల పాటు రోజూ 8, 6,4 గంటల చొప్పున శిక్షణ ఉంటుంది. తక్కువ రోజులు అయితే ఎక్కువ గంటలు శిక్షణ కొనసాగుతుంది.
- ఒక్కో మహిళ శిక్షణ పొందేందుకు ప్రభుత్వం రూ.21 వేలు ఖర్చు చేయనుంది.
- జిల్లా, డివిజన్ కేంద్రాలతోపాటు, మండల కేంద్రాల్లోనూ శిక్షణ తరగతులు ఉంటాయి.
- కుట్టు మిషన్ల పథకానికి బీసీ, కాపులతోపాటు అగ్రవర్ణాల్లోని పేదల కోటాలో కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మహిళలు అర్హులు.
- అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సెల్ నంబరుతో సమీపంలోని సచివాలయం, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలి.
- https://apobmms.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- టైలరింగ్ శిక్షణ పూర్తయ్యాక పరీక్ష ఉంటుంది.
- ఒక్కో మిషన్ విలువ రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఉంటుంది.
- శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో మళ్లీ శిక్షణ తీసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.