డైలీ గ్రీన్ బీన్స్‌ను తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..? తెలిస్తే వెంటనే తింటారు..!
డైలీ గ్రీన్ బీన్స్‌ను తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..? తెలిస్తే వెంటనే తింటారు..!
చాలా మంది గ్రీన్ బీన్స్ ను చూసే ఉంటారు. ఇతర కూరగాయల్లాగే ఇవి కూడా మనకు మార్కెట్‌లో లభిస్తుంటాయి. కానీ గ్రీన్ బీన్స్‌ను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. గ్రీన్ బీన్స్‌ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు తమ ఆహారాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గ్రీన్ బీన్స్ వాస్తవానికి చాలా ఆరోగ్యకరమైన కూరగాయల కిందకు వస్తాయి. గ్రీన్ బీన్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ గ్రీన్ బీన్స్‌ను తింటే అనేక వ్యాధులు నయం అవుతాయని వారు అంటున్నారు. అంతేకాదు.. ఈ బీన్స్ అనేక పోషకాలకు నెలవుగా కూడా ఉన్నాయి. గ్రీన్ బీన్స్‌ను తరచూ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
నియంత్రణలో కొలెస్ట్రాల్ లెవల్స్..
బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. గ్రీన్ బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. గ్రీన్ బీన్స్‌ను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అలాగే ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా మలబద్దకం ఉన్నవారు రోజూ గ్రీన్ బీన్స్‌ను తింటే సుఖంగా విరేచనం అవుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
శిశువు ఎదుగుదలకు..
ఈ గ్రీన్ బీన్స్‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలు బీన్స్‌ను తింటే శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుకతో లోపాలు రాకుండా నివారించవచ్చు. గ్రీన్ బీన్స్ లో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి గ్రీన్ బీన్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. గ్రీన్ బీన్స్‌లో ఐరన్ కూడా ఎక్కువే. రక్తహీనత ఉన్నవారు తరచూ గ్రీన్ బీన్స్‌ను తింటే రక్తం తయారవుతుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
కండరాల ఆరోగ్యానికి మెగ్నిషియం..
గ్రీన్ బీన్స్‌లో అధికంగా ఉండే మెగ్నిషియం కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల నిర్మాణానికి సహాయం చేస్తుంది. కండరాలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు. కండరాల నొప్పులు సైతం తగ్గుతాయి. గ్రీన్ బీన్స్‌లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా గ్రీన్ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గ్రీన్ బీన్స్ ఆరోగ్యకరమే అయినప్పటికీ కొందరికి సరిగ్గా జీర్ణం కావు. వీటిని తింటే అజీర్తి సమస్య వచ్చేవారు వీటిని తినకపోవడమే మంచిది.