kendriya vidyalaya: కేవీల్లో పిల్లలను చేర్పించాలా.. అడ్మిషన్ల వివరాలు
kendriya vidyalaya: కేవీల్లో పిల్లలను చేర్పించాలా.. అడ్మిషన్ల వివరాలు
• పిల్లలను కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలనుకుంటున్నారా..
• అయితే తల్లిదండ్రులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కేంద్రీయ విద్యాలయాల్లో నేర్పించడానికి ప్రయత్నిస్తుంటారు. బయట స్కూల్లలో భారీగా ఉన్న ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందడానికే కాక.. ఇక్కడ చేర్పిస్తే ప్లస్ 2 (ఇంటర్) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చన్న ధీమా ఇందుకు మరో కారణం. కేంద్రీయ విద్యాలయాల్లో సీటు రావడం చాలా కష్టమైనప్పటికీ, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండటంతో పిల్లల్ని చేర్పించాలనుకొనేవారు కేంద్రీయ విద్యాలయ ప్రవేశ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో తమ పిల్లల్ని చేర్చాలనుకొంటున్న తల్లిదండ్రుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు..
మనం దేశవ్యాప్తంగా 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ విద్యాలయాలు అన్నీ కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (Kendriya Vidyalaya Sanghatan)కింద పనిచేస్తాయి. పిల్లలకు నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్యనందించడమే వీటి లక్ష్యం. ఇక్కడ కేవలం చదువుకే పరిమితం కాకుండా ఆటలు, ఇతర కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన అంశాలు:
• కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతిలో చేరాలంటే పిల్లల వయసు కనీసం ఆరేళ్లు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న విద్యార్థుల అడ్మిషన్ ఫారమ్‌లను తిరస్కరిస్తారు.
• ఏప్రిల్ 1 నాటికి ఆరేళ్లు నిండిన విద్యార్థుల దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. 9, 11 తరగతుల్లో నమోదు చేసుకొనే విద్యార్థులకు కనిష్ఠ లేదా గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ లేదు.
• ప్రవేశ దరఖాస్తుల్లో ఏ చిన్న లోపం ఉన్నట్లు పరిశీలనలో తేలినా అడ్మిషన్ నిరాకరిస్తారు. అందుకే దరఖాస్తు నింపేటప్పుడు తప్పుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
• భారత్‌తో పాటు కాఠ్‌మాండూ, మాస్కో, టెహ్రాన్‌లలోనూ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ పాఠశాలలే.
• 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 1 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
• తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 71 కేవీలు ఉండగా.. ఏపీలో 36 తెలంగాణలలో చెరో 35 చొప్పున ఉన్నాయి.
• దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకేరకమైన సిలబస్‌ను అనుసరించడం వల్ల బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లలకు చదువులో ఇబ్బంది తలెత్తదు.
తరగతుల వారీగా ఉండే నామమాత్రపు ఫీజులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు తదితర అప్‌డేట్స్‌ను తల్లిదండ్రులు కేవీ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ లో తెలుసుకోవచ్చు.
ఈ స్కూళ్లను తొలుత భారత రక్షణ దళాల్లోని సైనికుల పిల్లల కోసం స్థాపించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ప్రజలకు సైతం అవకాశం కల్పిస్తున్నారు.
దరఖాస్తు విధానం ఇలా:
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. 11వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనుండగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మార్చి 31వ తేదీ నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్యలో వయసున్న విద్యార్థులు అర్హులు కాగా ఈ నెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనన, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దరఖాస్తులను పరిశీలించి, లాటరీలో ఎంపికైన విద్యార్థుల వివరాలను విద్యాలయం సంఘటన్ నేరుగా ఆయా కేవీఎస్లకు అందజేస్తుంది. మిగిలిన తరగతుల్లో ప్రవేశాలకు విద్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తులు సమర్పించాలి.
వీరి పిల్లలకు ప్రాధాన్యం:
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయించనుండగా తొలి జాబితా ఈనెల 25న, రెండో జాబితా ఏప్రిల్ 2న, మూడో జాబితా ఏప్రిల్ 7న ఉంటుంది. అడ్మిషన్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తృతీయ ప్రాధాన్యం కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు నాలుగో ప్రాధాన్యం ఉంటుంది. విద్యాహక్కు చట్టం కింద 10 సీట్లు పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారు అర్హులు.
రిజర్వేషన్ ఇలా:
కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు రిజర్వేషన్ ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం ఉంటుంది. ఒకటో తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య వయస్సు అర్హతగా నిర్ణయించగా 2వ తరగతిలో ప్రవేశానికి 7-9 ఏళ్లు, 3, 4వ తరగతుల విద్యార్థులకు 8-10ఏళ్ల వయస్సు, 5వ తరగతికి 9-11, ఆరుకు 10-12, 7వ తరగతికి 11-13, 8వ తరగతికి 12-14, 9వ తరగతికి 13-15, 10వ తరగతికి 14-16 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతి తరగతికి రెండు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌కు 40 సీట్ల చొప్పున 80 మందికి ప్రవేశం ఉంటుంది.
లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ:
ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయనుండగా 2నుంచి 8వ తరగతి వరకు ప్రాధామ్యాల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుంది. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం ప్రవేశ పరీక్ష, పదోతరగతి మార్కుల ఆధారంగా 11వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎస్ఎస్సీ ఫలితాలు వెల్లడైన పది రోజుల్లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు:
>> 1వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : మార్చి 1 నుంచి 21
>> ఒకటో తరగతి తొలి జాబితా : మార్చి 25
>> అడ్మిషన్ల రెండో జాబితా : ఏప్రిల్ 2
>> మూడో జాబితా : ఏప్రిల్ 7, 2025
>> 11వ తరగతి మినహా అన్ని తరగతుల్లో అడ్మిషన్లకు తుది గడువు : జూన్ 30, 2025.